– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఈ నెల (మే)5వ తేదీన విడుదల కానుంది. తొలుత 32,000 మంది మహిళలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లారని, వారు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని పేర్కొనడం పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఈ సినిమా టీజర్ విడుదలైన వెంటనే అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్షాలు, యూడీఎఫ్ లీడర్లు సినిమాను ప్రదర్శించరాదని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మాట్లాడుతూ.. తమ వైఖరి స్పష్టంగా ఉందని, స్వేచ్ఛా వ్యక్తీకరణ పేరుతో ఎవరినీ దుష్ప్రచారం చేయనివ్వబోమన్నారు. సినిమాపై నిషేధం విధించాలని కోరారు.
కాగా, ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. అంతేకాకుండా 32వేల మంది మహిళలు అదృశ్యమయిన విషయాన్ని నిరూపిస్తూ కోటి రూపాయల రివార్డు అందిస్తామని ముస్లిం యూత్ లీగ్ కేరళ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మితవాద కార్యకర్త, హిందూ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు ప్రతీష్ విశ్వనాథ్ కూడా దీనికి విరుద్ధంగా నిరూపించడానికి రూ. 10 కోట్లు ఆఫర్ చేశాడు. కేరళ నుండి ఎవరూ ISలో చేరడానికి సిరియాకు వెళ్లలేదని తెలిపారు.
ఇక.. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇది ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన కేరళలోని నలుగురు మహిళా కళాశాల విద్యార్థుల ప్రయాణాన్ని ట్రేస్ చేస్తుంది. ఈ సినిమాలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కూడా నటించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.