ఓ కూలీ కోట్ల రూపాయలు తన ఖాతాలో పడ్డాయన్న ఆనందం కొన్నిగంటల్లోనే మాయమైంది. అతడి జన్‌ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు తెలుసుకుని షాకయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల బీహారీ లాల్ రాజస్థాన్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు రూ.600 నుంచి రూ.800 సంపాదించేవాడు. అయితే వర్షాల వల్ల ఆ ఇటుక బట్టీ మూతపడింది. దీంతో అతడు కన్నౌజ్ జిల్లాలోని సొంత ఊరికి ఇటీవల తిరిగి వచ్చాడు. బిహారీ లాల్ తన జన్‌ధన్ బ్యాంకు ఖాతా నుంచి వంద రూపాయలు డ్రా చేశాడు.
అయితే అతడి మొబైల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో తన బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించాడు. వెంటనే బ్యాంకు మిత్రా సిబ్బంది వద్దకు వెళ్లాడు. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో చూడాలని కోరాడు. ఒకటికి మూడుసార్లు పరిశీలించగా.. అతడి జన్‌ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్ కూడా ప్రింట్ తీసి ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడంపై బీహారీ లాల్ ఆశ్చర్యపోవడంతో పాటు సంబరపడిపోయాడు. అయితే అతడి ఆనందం కొన్ని గంటల్లో ఆవిరైంది. బీహారీ లాల్ ఆ తర్వాత తన బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాడు. అక్కడ జన్‌ధన్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.126 మాత్రమే ఉండటం చూసి నిరాశ చెందాడు. తన ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌తోపాటు స్టేట్‌మెంట్ ప్రింట్‌ను బ్యాంకు అధికారికి చూపించాడు. అయితే బ్యాంకింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు.