నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ (నీట్) పరీక్ష రాయడానికి వచ్చిన గర్ల్స్‌ని ఇన్నర్ వేర్స్ ఇప్పించడంపై జాతీయ విమెన్స్ కమిషన్ సీరియస్ అయ్యింది. కేరళలోని కొల్లాంలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు కళాశాల సిబ్బందితో సహా ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు. జూలై 17న కొల్లాంలోని మార్ థోమా కాలేజీలో ఈ ఘటన జరగగా జులై 18న ఓ విద్యార్థిని ఈ విషయమై కంప్లెయింట్ చేసింది. అరెస్టయిన వారిలో నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు కళాశాల సిబ్బంది, సెంటర్ భద్రతను అప్పగించిన ఏజెన్సీకి చెందిన ముగ్గురు ఉన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) దుస్తుల కోడ్‌లో ఇన్నర్‌వేర్‌ను తొలగించాలని సూచించనప్పటికీ, తన కుమార్తెతో సహా ఇతర విద్యార్థులు మానసికంగా హింసకు గురయ్యారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కనీసం 90 శాతం మంది విద్యార్థులను పరీక్ష రాయడానికి ముందు ఇన్నర్‌వేర్‌లను తీసేయించారని, వాటిని స్టోర్ రూమ్‌లో పడేశారని బాలిక తండ్రి పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 509 (మహిళ యొక్క అణకువను అవమానించేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.