మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కుటీర పరిశ్రమ చేనేత. దేశవారసత్వ సంపదగా చేనేత పరిశ్రమకు చరిత్రలో విశేషప్రాముఖ్యత ఉంది. స్వాతంత్య్ర పోరాట సమయంలోనూ పలు ఉద్యమాలు చేనేత పరిశ్రమ కేంద్రంగానే కొనసాగాయి. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు అనాదిగా ఈ రంగమే జీవనోపాధి కల్పిస్తోంది. నేడు చేనేత వృత్తి మసకబారుతోంది. నేత వస్త్రాలకు డిమాండ్ బాగా ఉన్నప్పటికీ చేనేత కార్మికులు సంఖ్య మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. నేతన్నలకు గుర్తింపు, ప్రోత్సాహం లేక.. ఇతర మార్గాల్లో పయనిస్తున్నారు. ఒకనాడు ప్రతి చేనేత ఇల్లు మగ్గాలు చప్పుళ్లు, చేనేత ఉత్పత్తులతో కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. చేనేత ఇంట్లోని మగ్గాలు బోసిపోతున్నాయి
పద్మసాలీలు ముఖ్యంగా వీధుల్లో మొల కట్టడం, ఇళ్ల్లల్లో మగ్గాలు నెయ్యడం, ఆసులు తిప్పడం, రాట్నంతో కండీలు చుట్టడం, అచ్చులు అతకడం వంటి పనులు ఇంట్లో చిన్నాపెద్దా సహా అందరూ చేసేవారు. ఇప్పుడు ఆ పనులు చేసేవాళ్లు వెతికినా కనిపించడం లేదు. దళారీల వ్యవస్థే తీరుతో అచ్చులు అతకడం వంటి పనులు ఉదయం నుంచి రాత్రి వరకు చేసినా.. 20 రూపాయలు వస్తే గగనమయ్యేది. కుటుంబమంతా కష్టపడి పనిచేయడం వల్ల అప్పట్లో కుటుంబం గడిచేది. వర్షకాలం వచ్చిందంటే.. మగ్గం పనులు చేయలేని పరిస్థితి. ఈ రకంగా తమ వృత్తికి ఆదరణ, ఆదాయం సరిగా ఉండేది కాదు. దీంతో చేనేతలు తమ పిల్లలను బంగారపు పని, టైలరింగ్ వంటి ఇతర వృత్తులు నేర్పించేవారు. అయితే పిల్లలు పనులకే పరిమితం కాకుండా చదువుపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు స్థానిక నేతలు ముందుకొచ్చారు.
నేత పనిచేసేవారు ప్రస్తుతం పెద్దవాళ్లు మాత్రమే ఉన్నారు. దీంతో చేసేదిలేక దళారులు అందరూ కరెంట్‌తో పనిచేసే పవర్ మగ్గాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా బెంగళూర్ వంటి ఇతర ప్రాంతాల్లో పవర్ మగ్గాలపై నేచిన వస్త్రాలు. అక్కడ నుంచి చీరాలకు దిగుమతి చేసుకుని అమ్మకాలు జరుపుతున్నారు. చేనేత పని చేసేవారే కరువయ్యారు. గతంలో గుర్తింపు, ఆదాయం లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించింది. చేతివృత్తులు అడుగంటిపోకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. నేత నేయడంలో ఎంతో సంతృప్తి ఉండేదని చీరాలకు చెందిన వీరాంజనేయులు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital