Tuesday, November 26, 2024

Politics: కాంగ్రెస్‌లో హీటెక్కిస్తున్న‌ అంతర్గత రాజకీయం.. మరోసారి బయటపడ్డ విభేదాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా రాజకీయవేడి రగులుతోంది. పార్టీ నాయకుల మధ్య నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది. నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పట్లో సమిసిపోయేటట్లుగా కనిపించడం లేదు. ఒక వైపు అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న హస్తం పార్టీకి.. నాయకుల మధ్య అంతర్గత పంచాయతీలు మరింతగా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో 12 రోజుల పాటు చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో నాయకుల్లో ఐక్యతారాగం ఉన్నట్లే కనిపించినా.. అది మూడు రోజుల ముచ్చటగానే మారంది.

టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మాత్రం సమిసిపోలేదని మరోసారి రుజువైంది. ఒక వైపు నాయకుల్లో కలహాలు బయటికి వస్తుంటే.. మరో వైపు కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్లు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా.. ఇప్పుడు మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి క్యాన్సర్‌ వ్యాధి సోకిందని, ఇప్పుడు నయం కావడం కూడా కష్టమని శశిధర్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతోంది.

ఇది కూడా చదవండి : బద్మాష్ చంద్రబాబూ, నువ్వు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించావ్‌: మంత్రి జయరాం

- Advertisement -

గతంలో టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌లను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడిన జగ్గారెడ్డి.. ఇప్పుడు ఏకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు టీ పీసీసీ మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌లపై విమర్శలు ఎక్కుపెట్టడం హస్తం పార్టీలో తీవ్ర చర్చగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావడం కంటే.. రోజు రోజుకు బలహీనం అవుతోందని, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నామనే విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటీ వరకు ఎందుకు సమీక్ష చేయడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని, సమిష్టి నిర్ణయాలతోనే ముందుకెళ్లితే పార్టీ బలోపేతం అవుతుందని వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. ఒక వైపు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి రాజకీయ క్రీడ అడుతుంటే.. అందులో కాంగ్రెస్‌ పార్టీ వెనక్కివెళ్లుపోతుందని , దీంతో పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే బలంగా ఉన్నప్పటికి.. పార్టీ కేడర్‌కు పని చెప్పడంలో నాయకత్వం విఫలమవుతోందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Big Story: అంగన్‌వాడీలకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.. మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement