హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌పై మెగాస్టార్ చిరంజీవి ఇవ్వాల స్పందించారు. నాలుగేండ్ల పసిపాపై జరిగిన లైంగికదాడి ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే దీనికి పరిష్కారమన్నారు.
అన్ని ప్రభుత్వం పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు చిరంజీవి. దీనికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత అని చిరంజీవి గుర్తు చేశారు. ఈ చిన్నారికి జరిగిన అఘాయిత్యంపై చిరంజీవి రెస్పాండ్ అయిన విషయం ఇప్పుడు ట్విట్టర్లో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. చాలామంది సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.