– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
భార్యాభర్తలైన 55 ఏళ్ల బూన్తోమ్ చైమూన్, 49 ఏళ్ల అమ్నుయ్ చైమూన్కు 27 ఏళ్ల కిందట పెళ్లి అయ్యింది. ఈ మధ్య రోడ్ ట్రిప్ కోసం వాళ్లిద్దరూ కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటలకు కారును రోడ్డు పక్కగా భర్త ఆపాడు. మూత్ర విసర్జన కోసం ఒక పక్కకు వెళ్లాడు. వెనుక సీటులో కూర్చున్న భార్య కూడా కారు దిగి సమీపంలోని చెట్లచాటుకు వెళ్లింది. అయితే.. ఈ విషయం తెలియిని అతను మాత్రం కారుతో అలా వెళ్లిపోయాడు. భార్య కారు దిగిన విషయాన్ని గమనించలేదు. కారులోని వెనుక సీటులో ఆమె నిద్ర పోతున్నదని భావించాడు. దీంతో కారును డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే రోడ్డు వద్దకు వచ్చిన భార్య, భర్తతోపాటు కారు కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. మొబైల్ ఫోన్ కూడా కారులో ఉండిపోవడంతో ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. ఇలా రెండు గంటలపాటు నడిచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన విషయం పోలీసులకు చెప్పింది. భర్త మొబైల్ నంబర్ గుర్తు లేకపోవడంతో కారులో వదిలిన తన మొబైల్ ఫోన్కు పలుసార్లు ఫోన్ చేసింది. ఆ మొబైల్ వెనక సీటులో ఉండటంతో భర్తకు వినిపించలేదు.
మరోవైపు పోలీసులు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు ఉదయం 8 గంటల సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న భర్తను కాంటాక్ట్ చేశారు. అతడు అప్పటికే 150 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాడు. భార్యను వదిలేసిన సంగతి తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చాడు. తన భార్య వద్దకు చేరుకున్న తర్వాత జరిగిన పొరపాటుకు క్షమించమని ప్రాధేయపడ్డాడు. అయితే.. భార్య కూడా భర్తపై ఆగ్రహం చెందలేదు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఇది చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల, భర్త పొరపాటును ఆమె అర్థం చేసుకుని ఉంటుందని భావించారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..