Friday, November 22, 2024

The Great Fight – కింగ్..ఎవరు? – ఎన్డీఏ వర్సెస్ ఇండియా

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : జనరల్​ ఎలక్షన్స్​ జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ యుద్ద వాతావరణం కనిపిస్తోంది. రెండు ప్రధాన రాజకీయ కూటములకు నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తమ తమ సత్తా చాటుకునేందుకు పోటాపోటీ యత్నాలు చేస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్లాన్స్​ వేస్తోంది. అయితే.. మోదీ హవానీ అడ్డుకోవాలని ఇండియా కూటమి యత్నిస్తోంది. తూర్పు భారతంలోని 7 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి పట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో అసోంలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ ఇండియా కూటమి ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. పైగా 2023 మణిపూర్​ హింస తర్వాత ఈశాన్య భారతంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. అందుకని ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎంతమేర బలం ఉందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే..

దక్షిణ భారతం..

తమిళనాడు :

ఇక్కడ మొత్తం 39 సీట్లు ఉన్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో.. డీఎంకే- కాంగ్రెస్​ కూటమికి 38 సీట్లు వచ్చాయి. అన్నాడీఎంకే-కాంగ్రెస్​ కూటమి ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. బీజేపీ ఖాతా తెరవలేదు. తమిళనాడులో ఇండియా కూటమి బలంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడటం, బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం కూడా.. ఇండియా కూటమికి కలిసి వచ్చే విషయం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేరళ :

- Advertisement -

కేరళలో 20 లోక్​సభ సీట్లున్నాయి. గత ఎలక్షన్​లో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ హవా కొనసాగింది. 20 స్థానాల్లో.. 19 చోట్ల గెలిచింది. కాగా, ఆ తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐఎం గెలుపొందింది. ఇండియా కూటమిలో సీపీఐ-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఫైట్​ ఎలా ఉంటుందో చూడాలి. ఇక బీజేపీకి.. ఇక్కడా పెద్దగా బలం లేదు.

కర్నాటక :

కర్నాటకలో మొత్తం 28 సీట్లున్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. 28 స్థానాల్లోని 25చోట్ల కమలదళం గెలిచింది. ఒక చోట బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కానీ, ఈ రాష్ట్రంలో కూడా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. బీజేపీ దారుణంగా విఫలైంది. ఇక.. ఇప్పుడు జేడీఎస్​తో బీజేపీ కలిసింది. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్​ బలంగా ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్​ని ఢీకొట్టే దూరంలోనే ఉంది.

తెలంగాణ :

తెలంగాణలో మొత్తం 17 లోక్​సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్​ఎస్​ 9, కాంగ్రెస్​-3, బీజేపీ-4 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఘోరంగా విఫలమైంది. ఈ ప్రభావం లోక్​సభ ఎన్నికలపైనా ఉంటుందని అంచనాలున్నాయి. కీలక నేతలు వలస వెళ్లిపోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్​ బలంగా పుంజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల దూకుడును లోక్​సభ ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని పార్టీ కేడర్​ తహతహలాడుతోంది. రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్​ :

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 25 లోక్​సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్​సభ ఎన్నికల్లో దుమ్మురేపింది. 25 సీట్లల్లో 22 చోట్ల గెలిచింది. టీడీపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన, బీజేపీ ఖాతా తెరవలేదు. అయితే.. ఈసారి మూడు విపక్ష పార్టీలు పొత్తుగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. మరి ఇది ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

ఉత్తర భారతం..

బీహార్​ :

ఇక్కడ 40 లోక్​సభ సీట్లున్నాయి.గత ఎన్నికలలో బీజేపీ 17, జేడీయూ 16 చోట్ల గెలిచాయి. కాంగ్రెస్​ ఒక్కటంటే, ఒక్క చోట విజయం సాధించింది. ఇక నితీశ్​ కుమార్​ రూపంలో ఇండియా కూటమి అతిపెద్ద షాక్​ తగిలింది. కూటమిలో కీలకంగా ఉన్న ఆయన.. చివరి నిమిషంలో ఎన్​డీలోకి స్విచ్​ అయ్యారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఎన్​డీఏ బలం మరింత పెరిగింది.

ఛత్తీస్​గఢ్​ :

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 11 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 9 సీట్లు దక్కాయి. కాంగ్రెస్​ 2 చోట్ల గెలిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.

ఢిల్లీ :

ఇక్కడ మొత్తం 7 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 7 చోట్ల గెలిచి క్లీన్​ స్వీప్​ చేసింది. ఆమ్​ ఆద్మీ షాక్​కు గురైంది. కానీ ఇండియా కూటమి ఆశలు కేజ్రీవాల్​పై భారీగానే ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆయన భాగంగా ఉన్నారు. ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

గోవా :

గోవాలో రెండు సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​కి తలోక సీటు వచ్చింది. ఇక్కడ బీజేపీ బలంగా కనిపిస్తోంది. ప్రమోద్​ సావంత్​ నేతృత్వంలో కమలదళం బలంగా ముందుకు వెళుతోంది.

గుజరాత్ ​:

గుజరాత్​లో 26 సీట్లున్నాయి. అనాదిగా.. ఇది బీజేపీ కంచుకోట అన్న విషయం తెలిసిందే.. గత ఎన్నికల్లోనూ ఇక్కడ 26 సీట్లను వెనకేసుకుంది బీజేపీ. ఈసారి కూడా అదే రిపీట్​ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీకి పెద్దగా బలం లేదు.

హరియాణా :

హరియామాలో మొత్తం 10 సీట్లల్లో.. 2019లో బీజేపీ 10 సీట్లు గెలిచింది. ఇక్కడ పార్టీ కేడర్​ బలంగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు.. కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా చేశారు​. జేజేపీతో పొత్తును తెంచుకుని, బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభావం లోక్​సభ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.

హిమాచల్​ప్రదేశ్​ :

4 సీట్లున్న హిమాచల్​ ప్రదేశ్​కి.. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అన్ని చోట్లా గెలిచింది. కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు. కానీ, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అనూహ్యంగా గెలిచి, పార్టీ బలంగా ఉన్నట్టు నిరూపించింది. ఆ తర్వాత పార్టీలో సంక్షోభం ఏర్పడింది. అదే అవకాశమని బీజేపీ భావిస్తోంది.

జమ్ముకశ్మీర్​ :

ఇక్కడ 6 సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. నేషనల్​ కాన్ఫరెన్స్​ 3 చోట్ల గెలిచింది. కానీ, 2019 తర్వాత ఇక్కడ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. మరి వీరిని బీజేపీ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇక్కడ బీజేపీ మంచి ప్రదర్శన చేయగలిగితే.. ఆర్టికల్​ 370 నిర్ణయం సరైనదే అని స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంది.

జార్ఖండ్ ​:

జారఖండ్​లో 14 లోక్​సభ సీట్లున్నాయి. బీజేపీ 11 చోట్ల గెలిచింది. ఝార్ఖండ్​ ముక్త్​ మోర్చా 1 చోట, కాంగ్రెస్​ 1 చోట, ఆల్​ ఝార్ఖండ్​ స్టూడెంట్​ యూనియన్​ ఒక చోట గెలిచింది. హేమంత్​ సొరేన్​ జైలుకు వెళ్లడంతో ఇక్కడ రాజకీయ పరిణామాల్లో మార్పు వచ్చింది. ఇక్కడ గెలవాలని కాంగ్రెస్​, బీజేపీ తీవ్రంగా కృషిచేస్తున్నాయి.

మధ్యప్రదేశ్ ​:

మధ్యప్రదేశ్​లో మొత్తం 29 లోక్​సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 28 చోట్ల గెలవగా.. కాంగ్రెస్​ 1 సీటు దక్కించుకోగలిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ ఘోరంగా ఓడిపోయింది. మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్​ బలంగా ఉంది. కానీ, ఇప్పుడు బీజేపీకి ఎడ్జ్​ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఛండీగఢ్​ :

ఇక్కడ ఒక్క సీటు ఉంది. గత ఎన్నికల్లో దీన్ని కాస్త బీజేపీ గెలిచింది.

మహారాష్ట్ర :

2019 లోక్​సభ ఎన్నికల తర్వాత.. రాజకీయాల పరంగా చాలా మార్పులు చోటుచేసుకున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడి రాజకీయ చదరంగం.. దేశవ్యాప్తంగా వార్తలకెక్కింది. చూస్తుంటే.. ఇక్కడ బీజేపీ- ఏక్​నాథ్​ షిండే- అజిత్​ పవార్​ ఎన్​సీపీ బలంగా కనిపిస్తోంది. కానీ, విపక్ష ఇండియా కూటమి కూడా మహారాష్ట్రపై ఆశలు పెట్టుకుంది! రాజకీయ దిగ్గజ శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్రె, కాంగ్రెస్.. గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఒడిశా :

ఒడిశాలో 21 లోక్​సభ సీట్లున్నాయి. నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలోని బీజేడీకి గత ఎన్నికల్లో 12 సీట్లు వచ్చాయి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఇండియా కూటమి ప్రభావం ఇక్కడ శూన్యం! అయితే.. బీజేడీ వర్సెస్​ బీజేపీలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి! ఏది ఏమైనా.. ఎన్​డీఏ కూటమిలో లేకపోయినా.. ప్రధాని మోదీకి నవీన్​ పట్నాయక్​ ఎప్పుడూ మద్దతుగానే ఉంటారన్న విషయం తెలిసిందే.

పంజాబ్ ​:

ఇండియా కూటమి బలంగా ఉన్న మరో రాష్ట్రం పంజాబ్​. వాస్తవానికి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ని ఓడించే ఆమ్​ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇండియా కూటమిలో భాగంగా.. ఈ పార్టీలు కలిసే ఉండటం పాజిటివ్​ విషయం. ఇక బీజేపీ ప్రభావం ఈ రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంది. పైగా.. రైతు ఉద్యమం కూడా కమలదళానికి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్​-8, ఎస్​ఏడీ-2, బీజేపీ-2, ఆమ్​ ఆద్మీ- 1 చోట గెలిచాయి.

రాజస్థాన్ ​:

రాజస్థాన్​లో 25 సీట్లు ఉన్నాయి. బీజేపీ 24 చోట్ల గెలిచింది. కాంగ్రెస్​ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ విఫలమైంది. బీజేపీ బలంగా పుంజుకుంది.

ఉత్తరాఖండ్​ :

ఇక్కడ బీజేపీ బలం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ.. 5 సీట్లకు, 5 చోట్ల గెలిచింది. కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

పశ్చిమ్​ బెంగాల్ ​:

ఇక్కడ మొత్తం 42 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో టీఎంసీకి 22 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 2తో సరిపెట్టుకుంది. కానీ బీజేపీ.. అనూహ్యంగా పుంజుకుని 18 స్థానాలను కైవశం చేసుకుంది. ఈసారి కూడా మంచి ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. ఎటొచ్చి.. ఇండియా కూటమి పరిస్థితే దారుణంగా ఉంది! కూటమిలో కీలక నేతగా ఎదిగిన మమతా బెనర్జీకి.. సీట్ల విషయంలో కాంగ్రెస్​తో సెట్​ అవ్వలేదు. 42 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇది కాంగ్రెస్​కు నచ్చలేదు. మరి.. అంతర్గత కలహాలతో ప్రజల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. నిజం చెప్పాలంటే.. అసలు ఇక్కడ ఇండియా కూటమే లేదని అనుకోవాలి!

ఉత్తర్​ప్రదేశ్ ​:

యావత్​ భారత దేశంలో.. లోక్​సభ విషయానికి వస్తే అత్యంత కీలక రాష్ట్రంగా ఉంటుంది ఉత్తర్​ ప్రదేశ్​. ఇక్కడి 80 సీట్లల్లో.. బీజేపీ 62 చోట్ల గెలిచింది. బీఎస్​పీ 10 సీట్లు దక్కించుకుంది. ఎస్​పీకి 5, కాంగ్రెస్​కి 1 సీటు వచ్చాయి. అప్నా దళ్​ (ఎస్​) ఒక సీటు పొందింది. ఉత్తర్​ ప్రదేశ్​లో యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో బీజేపీ పటిష్ఠంగా ఉంది. ఆయన్ని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి అస్త్రాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ గెలుపు 2019తో పీక్​ అయ్యిందని, ఈసారి సీట్లు తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి. కానీ.. బీజేపీ 400 టార్గెట్​కి దగ్గరగా రావాలంటే.. యూపీలో బీజేపీ బలమైన ప్రదర్శన చేయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement