హైదరాబాద్ లో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయిన విషయం అందరిలో కలకలం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి చేరలేదు. ఈ ఘటనలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రి స్థానికంగా ఉండే స్కూల్ లో పదో తరగతిచదువుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో వారిద్దరి స్కూల్ బ్యాగ్స్ సమీపంలోని సూరారం చెరువుగట్టుపై కనిపించాయి.ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల రేష్మా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని చిన్నకోడూరుకి చెందిన 17 ఏళ్ల శ్రావణి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఏడాదిగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం బాగోలేదని చెప్పి కాలేజీ నుంచి వచ్చేసిన శ్రావణి.. హాస్టల్ నుంచి బయటికి వచ్చి చౌటుప్పల్ వెళ్లింది. ఆ తర్వాత నల్గొండలో ఉంటున్న రేష్మా కూడా ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టి బయటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి పానగల్‌లోని ఉదయసముద్రం జలాశయానికి చేరుకున్నారు. ఉదయసముద్రం దగ్గర రెండు చున్నీలు, ఓ బ్యాగు పెట్టి వెళ్లారు. రేష్మా ఓ సూసైడ్ నోట్ రాసి బ్యాగులో పెట్టింది. వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.