Tuesday, November 26, 2024

బాలిక‌పై 9 రోజులుగా ఆ ప‌ని.. ఈ కేసులో 13మందికి 20 ఏళ్ల శిక్ష‌..

15 ఏళ్ల బాలికపై 9 రోజులపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ప్ర‌త్యేక కోర్టు శిక్ష విధించింది. ఈ ఘ‌ట‌న‌లో దోషులుగా తేలిన 13 మందికి ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్షను రాజస్థాన్‌లోని కోర్టు విధించింది. మరో ఇద్దరికి నాలుగేళ్ల పాటు ఖైదు చేసింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు అదనపు సెషన్‌ జడ్జి అశోక్ చౌద‌రి ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 16 మందికి కోర్టు శిక్ష విధించింది. మరో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది ప్ర‌త్యేక కోర్టు.. దీనికి సంబంధించిన నలుగురు మైనర్లు ఇప్పటికే స్థానిక జువెనల్‌ జస్టిస్‌ బోర్డులో వేర్వేరుగా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది మార్చి 6న రాజ‌స్థాన్‌లోని కోటా జిల్లా సుకేత్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ అత్యాచారం కేసు నమోదయ్యింది. పూజా జైన్‌ అనే మహిళ.. ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి, ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. అనంతరం ఆ బాలికను కొంత‌మంది యువకులు కొనుగోలు చేశారు. ఝలావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజులపాటు వారు ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. బాలికను విక్రయించిన మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 20 ఏళ్లు జైలుశిక్ష పడిన ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా కూడా వేసింది. నాలుగేళ్లు శిక్ష పడిన వారు రూ.7 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement