Friday, November 22, 2024

Big Story | గతి తప్పి, కోతలతో ముగిసిన ఆర్థిక ఏడాది

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: అనేక ఆశలతో 2022-23 ఆర్ధిక యేడాది ముగిసింది. ఈ ఏడాది సొంత వనరుల రాబడి అంచనాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణ, ముందుచూపు మరోసారి అవగతమవుతూ దాదాపు లక్ష్యం చేరుకున్నాయి. ఈ ఏడాది రూ. లక్షా 26వేల పన్నుల ఆదాయం అంచనాల్లో రూ. 1.25లక్షల కోట్లకు చేరాయి. ఇక పన్నులు, పన్నేతర, రుణాలతో కలుపుకుని ఈ మొత్తాలు రూ.1.85లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. అంటే పన్నేతరాలు, అప్పులు రాష్ట్ర బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో రూ.50వేల కోట్లకుపైగా బడ్జెట్‌ అంచనాల్లో గతి తప్పుతున్నట్లు స్పష్టమైంది. ఇందులో కీలకమైన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, రుణ సేకరణల్లో కేంద్ర వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక రాష్ట్ర సొంత వనరుల రాబడులైన ఎక్సైజ్‌, జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు వంటి వాటిలో 95శాతం లక్ష్యం చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు రూ. 39వేల కోట్లుగా ఉంది.

  • అంశం అంచనా వచ్చింది
  • పన్నులు 1,26,606 1,14,500
  • జీఎస్టీ 42189 40123
  • రిజిస్ట్రేషన్లు 15600 14500
  • అమ్మకం పన్ను 33000 30000
  • వ్యయాలు…
  • వడ్డీలు 18911 18200
  • జీతాలు 33942 32000
  • పింఛన్లు 11384 15000
  • రాయితీలు 12049 10000

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాతా రంగాలకు నిధులను వెచ్చిస్తూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడింది. కొన్ని బిల్లుల్లో జాప్యం ఎదురైనా రానున్న ఏడాదిలో చెల్లింపుల దిశగా కార్యాచరణ చేస్తోంది. ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకాలు నేటినుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్ధిక ఏడాదిలో ఉనికిలోకి రానున్నాయి. ముగిసిన 2022-23 ఆర్ధిక ఏడాది బడ్జెట్‌ రూ. 2.56 లక్షల కోట్లల్లో అంచనాలు గతి తప్పి కేవలం రూ. 2.07లక్షలకోట్లకే చేరినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితికి కేంద్రం విధించిన ఆర్ధిక నియంత్రణలు, షరతులే కారణమని అంటున్నారు.

- Advertisement -

ప్రధానంగా రాబడులపై ఈ ప్రభావం ఘననీయంగా పడటంతో బడ్జెట్‌ లెక్కలు తప్పాయని, అంచనాలు చేరడంలో అవరోధాలు ఎదురయ్యాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రెవెన్యూ వ్యయం కూడా రూ. 1.89లక్షల కోట్లకు అంచనాలు వేసుకోగా ఇది రూ. 1.70లక్షల కోట్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. మూలధన వ్యయాలు కూడా రూ. 30 వేల కోట్లనుంచి రూ. 26వేల కోట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రూ. 3700కోట్ల ముగులు చివరికి రూ. 2900కోట్లకు చేరనుందని అంటున్నారు.

బడ్జెట్‌లో నిర్దేశించుకున్న అప్పుల సాధనలో కేంద్ర ఇబ్బందులు మొత్తం ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తోంది. ఇక అప్పులపై వడ్డీల భారం మరింత తీవ్రమవుతున్నది. ఈ ఏడాది రూ. 39,450కోట్ల అప్పులకు కేంద్రం అనుమతివ్వగా, ఆశించిన అప్పుల్లో రూ. 19వేల కోట్లు కోత పడింది. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న అంచనా రాబడుల మొత్తం 2.56లక్షల కోట్లలో రూ. 50లక్షల కోట్లు కోతలు పడినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. రానున్న రోజుల్లో ముగిసిన ఆర్ధిక ఏడాది లక్ష్యసాధనపై సమగ్ర స్పష్టత వస్తుందని ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement