Wednesday, November 20, 2024

TS EAMCET​ అప్​డేట్స్: 14, 15 తేదీల్లో జరగాల్సిన పరీక్ష మాత్రమే వాయిదా, 18 నుంచి మార్పులేదు!

జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే 18, 19, 20 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్ష మాత్రం యథాతథంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంసెట్​ (Telangana EAMCET) అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడింది. రాగల మూడు రోజుల్లో మరింతగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేయడంతో జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇవ్వాల (బుధవారం) ప్రకటించింది. కేవలం అగ్రికల్చర్ పరీక్ష ను మాత్రమే వాయిదా వేస్తున్నామని.. ఇంజినీరింగ్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్​ ప్రొఫెసర్​ లింబాద్రి తెలిపారు. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సి ఉన్న ఇంజినీరింగ్ పరీక్షలను ఎప్పట్లాగానే నిర్వహిస్తామని వెల్లడించారు. వాయిదా పడిన అగ్రికల్చర్ పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఇక.. షెడ్యూల్ ప్రకారం జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్‌, మెడిసన్‌ పరీక్షలు.. 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, తెలంగాణలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుందా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఎంసెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్​ జిల్లాల్లో ఎంసెట్ కేంద్రాలు సైతం నీట మునిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దయనీయంగా ఉన్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల డిమాండ్లు, వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి.. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఇక.. ఈ నెల 18,19, 20 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్​ సెంటర్​లోకి అనుమతించరన్న నిబంధన ఉంది. అందుకని పరీక్షలకు హాజరుకావాల్సిన వారు ముందే పరీక్ష సెంటర్లకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియు)-హైదరాబాద్ ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇందులో ఇంజినీరింగ్ పరీక్ష కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 108 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు హాల్ టిక్కెట్‌ను వెంట తెచ్చుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఆ తర్వాత ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సి ఉంటుంది.  అభ్యర్థులు ఎట్లాంటి నోట్స్​, బుక్స్, కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్‌లు.. ఇతర ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రంలోకి తీసుకు రాకూడదన్న నిబంధన ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement