– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసే టీసీ ఆ రైలు కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ముంబయి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరేందుకు సిద్ధమైంది.
అయితే.. ఆ స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై టీసీ నిల్చొని ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే స్టేషన్ నుంచి ఆ రైలు కదిలడం ప్రారంభమైంది. కాగా, ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న టీసీ గమనించి వెంటనే తేరుకున్నాడు. కంపార్ట్‌మెంట్ల డోర్లు మూసుకుపోవడంతో చివరన ఉన్న లోకోపైలట్ క్యాబిన్ వద్దకు పరుగెత్తాడు. డోర్ తెరువాలంటూ కోరాడు. అంతేగాక రైలు కదులుతుండగా పాక్షికంగా తెరిచి ఉన్న లోకోపైలట్ ఉన్న క్యాబిన్‌లోకి ఎక్కేందుకు యత్నించాడు.
అయితే ఈ క్రమంలో పట్టుతప్పి ఆ రైలు కింద పడబోయిన టీసీని ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఆదుకున్నారు. కిందపడకుండా ప్రమాదం నుంచి అతడిని కాపాడారు. ఈ నెల 26వ తేదీన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.