Monday, November 25, 2024

హాస్పిటల్‌లో లంచం అడిగిన డాక్టర్.. స్పాట్ లోనే సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్

హైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లోని ఓ డాక్టర్ లంచం అడిగితే.. మంత్రి హరీశ్‌ రావు స్పాట్‌లోనే సస్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న సోమవారం ఉదయం జ‌రిగింది. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆరాతీశారు. గైనకాలజీ వార్డును సందర్శించిన మంత్రి సదరు వార్డులో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అందుకోసం అదనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. కాగా, ఏరియా హాస్పిటల్ కి వచ్చే గ‌ర్భిణుల‌కు 60 శాతానికి పైగా సాధారణ కాన్పులు జరగడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంఖ్యను మరింతగా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.

అయితే.. డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వస్తే పైస‌లు డిమాండ్ చేస్తున్నారని అక్కడున్న పలువురు మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి అక్కడున్న వాచ్‌మ‌న్‌, ఇతర సిబ్బందిని అక్కడే విచారణ చేశారు. బాధితులు చేసిన ఆరోపణలను నిజమని నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ కోసం రూ.2 వేలు డిమాండ్ చేసిన పిడియాట్రీషన్ డాక్టర్ మూర్తిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యం వహించినా, సేవల విషయంలో డబ్బులు డిమాండ్ చేసిినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని మంత్రి హెచ్చరించారు. ఎంతో నమ్మకంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సంతృప్తి కలిగేలా సేవలందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement