గుజరాత్ రాష్ట్రంలో జరిగిన కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 500 మందికి పైగా నదిలో పడిపోయారు. బ్రిడ్జి మీద నుంచి వెళుతున్న సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఈత వచ్చిన వారు నీళ్లలో ఈదుకుంటూ కూలిన బ్రిడ్జి శిథిలాలను ఆసరాగా చేసుకుని బయటపడే యత్నం చేస్తున్నారు. ఈత రానివారు నీళ్లలోనే జల సమాధి అయినట్టు తెలుస్తోంది. ప్రస్తతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, దాదాపు 100 మందికి పైగా చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 400 మందిని రెస్క్యూ టీమ్ కాపాడినట్టు సమాచారం.
ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఇంతకుముందే దెబ్బతిన్న ఈ కేబుల్ బ్రిడ్జికి రిపేర్లు చేసిన తర్వాత ఐదు రోజుల క్రితం సందర్శకుల రాకపోకలకు అనుమతించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌లను మోహరించారు. స్థానికుల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.