హైదరాబాద్, ఆంధ్రప్రభ: సాంప్రదాయ పీజీ కోర్సులకు క్రమంగా క్రేజ్ తగ్గుతోంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొన్నేళ్ల క్రితం పీజీ సీటు దక్కితే అదృష్టంగా భావించే వాళ్లు. ఈ క్రమంలోనే పీజీ ప్రవేశ పరీక్షకు అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఉమ్మడి పీజీ ప్రవేశకు సైతం క్రమంగా పోటీ తగ్గుతోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు గతేడాది 78,305 మంది దరఖాస్తు చేసుకుంటే ఈ సారి 67,117 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 11 వేలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకోకపోవడమే కాదు.. దరఖాస్తు చేసుకున్న వారిల్లోనూ చాలా మంది పరీక్షకు హాజరు కావడంలేదు.
2021లో దరఖాస్తు చేసుకున్న 78,305 మందిలో పరీక్షకు హాజరైంది మాత్రం 68,836 మంది మాత్రమే. ఈ ఏడాది కూడా 67,117 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో రాసింది మాత్రం 57262 మంది. గత కొన్నేళ్లగా సాంప్రదాయ కోర్సులైనటువంటి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ వంటి కోర్సులకు సంబంధించిన వాటికి విద్యార్థుల నుంచి ఆసక్తి తగ్గిపోతోంది.
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదైనా కంప్యూటర్ లేదా అనుబంధ కోర్సు నేర్చుకొని ఉద్యోగాల్లో చేరుతున్నారు. లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరికొంత మంది సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటే ఇంకొంత మంది మాత్రం డిగ్రీతోనే చదువు ఆపేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ఈనేపథ్యంలోనే పీజీకు క్రేజ్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
మిగిలిపోతున్న సీట్లు…
కేవలం వర్సిటీల్లోని సీట్లు మాత్రమే మొత్తానికి మొత్తం నిండిపోతున్నాయి. వర్సిటీ పరిధిల్లోని చాలా కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. తొలి విడత, రెండు, మూడు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించినా సీట్లు భర్తీ కావడంలేదు. 2021-22 విద్యా సంవత్సరంలో వివిధ పీజీ 46 కోర్సులకుగానూ 41,100 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 22,763 (55 శాతం) మాత్రమే నిండాయి. మిగిలిన 18,337 సీట్లు నిండలేదని అధికారిక గణాంకాల ప్రకారం తెలుస్తోంది. డిమాండ్ ఉన్న కోర్సులన్నింటిలోనూ ఎంతో కొంత సీట్లు మిగిలిపోతున్నాయి.
పీజీల్లో అమ్మాయిలే ఎక్కువ….
ఈనెల 20న విడుల చేసిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షకు 18,550 మంది అబ్బాయిలు, 38,712 మంది అమ్మాయిలు రాస్తే అందులో అబ్బాయిలు 17,613 మంది, అమ్మాయిలు 36,437 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 63 వేల మంది పరీక్షకు హాజరుకాగా అందులో అబ్బాయిలు 22 వేలు, అమ్మాయిలు 41 వేల మంది అర్హత సాధించారు. పీజీలో జాయిన్ అవుతున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. 8 యూనివర్సిటీ పరిధిల్లోని మొత్తం 320 కాలేజీల్లో 45,003 సీట్లు ఉంటే అందులో అమ్మాయిలు 67 శాతం, అబ్బాయిలు 30 శాతం ప్రవేశాలు పొందనున్నారు.
అమ్మాయిలను చదివించాలనే అవగాహన తల్లిదండ్రుల్లో పెరగడంతోనే ఉన్నత విద్యను అభ్యసించడానికి అమ్మాయిలు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దానికి తోడూ ఫీజు రీయింబర్స్‌మెంట్, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నత విద్యలో అమ్మాయిలు రాణించడానికి దోహదం చేస్తున్నాయని వర్సిటీ అధికారులు చెప్తున్నారు.