Friday, November 22, 2024

కొత్త సెక్రటేరియట్​ నిర్మాణం అద్భుతంగా ఉండాలే.. నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్​

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం నూతన సెక్రటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును సీఎం కేసీఆర్​ పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వీటిలోకి వెంటిలేషన్ బాగానే వస్తున్నదని సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ఆరా తీశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లయ్ గురించి వివరాలు తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణపనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement