Friday, November 22, 2024

పెట్రో ధ‌ర‌ల పెంపుపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న.. ప్ర‌జా సంక్షేమాన్ని బ‌ట్టే నిర్ణ‌యం..

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి.. ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో దేశంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుతాయ‌ని పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టి నుంచే పెట్రో ట్యాంకుల‌ను నింపేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుతాయా? అన్న దానిపై కేంద్ర పెట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ స్ప‌ష్ట‌త నిచ్చారు. దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకునే పెట్రో ధ‌ర‌ల పెంపు విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో పెట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ మాట్లాడారు. ‘చ‌మురు ధ‌ర‌లు ప్ర‌పంచ ధ‌ర‌ల బట్టి నిర్ణ‌యం అవుతాయి. ప్ర‌పంచంలో ఓ ప్రాంతంలో యుద్ధ వాతావ‌ర‌ణం అలుముకుంది. పెట్రో ధ‌ర‌ల పెంపు ప్ర‌జా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వుంటుంది’ అని హ‌ర్దీప్ సింగ్ పూరీ ప్ర‌క‌టించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిల కార‌ణంగానే పెట్రో ధ‌ర‌లు పెంచడం లేద‌న్న వార్త‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు. అయితే ఇంధ‌న అవ‌స‌రాలను తీర్చేలా చూసే బాధ్య‌త మాత్రం త‌మ‌దేన‌న్నారు. అతి త్వ‌ర‌లోనే పెట్రో కంపెనీలు దీనిపై నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని పేర్కొన్నారు. కాగా కేంద్ర పెట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేరెత్త‌కుండా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఎన్నిక‌లు ముగిశాయి.. అంద‌రూ పెట్రో ట్యాంకులు నింపుకోండి అంటూ ఓ యువ ఎంపీ ప‌దే ప‌దే పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ హ‌యాంలోనైతే పెట్రో ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ‌నే ఎత్తిపారేశారు. తాము మాత్రం గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో సెంట్ర‌ల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా త‌గ్గించాం.’ అని హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement