Thursday, November 21, 2024

Paddy Fight: దేశ రాజధాని గులాబీ మయం.. కేసీఆర్​ రైతు దీక్షకు అంతా రెడీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు ( సోమవారం ) టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన “తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష”కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణా భవన్‌లో ఏర్పాటు చేసిన వేదిక, సభా ప్రాంగణాన్ని ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు కె.ఆర్.సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్‌తో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

రైతులను బలోపేతం చేయాలి : కవిత
మండలం నుంచి ఎంపీ వరకు నేతలందరూ ధర్నాకు తరలివస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వ రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశ్‌గా మారిందని, పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు. అయితే రైతుల పంట సేకరణపై కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ భాద్యతని, ధాన్యం సేకరించకపోతే కనీస మద్ధతు ధరకు అర్ధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ర్టంలో రైతులు పండించిన పంటను సేకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న ప్రతి రైతుకు కేంద్రం భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. అది జరగపోతే దేశంలో అహారభద్రత ఇబ్బందులకు గురవుతుందని, రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదనే గుర్తించుకోవాలని నొక్కి చెప్పారు. ఇప్పటికే రైతుల అందోళనతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని, తెలంగాణా రైతుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కవిత కోరారు. కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్ల పైకి వచ్చి అందోళనకు సిద్ధమయ్యారని,
15 రోజులుగా ఎంపీలు ఆందోళన చేపట్టారని ఆమె అన్నారు. ఎమ్మెల్యేలు గల్లీల్లో నిరసన చేపట్టారని అన్నారు. దేశ రైతాంగాన్ని బలోపేతం చేయాలని, జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.

రైతులను కాపాడుకుంటాం : వినోద్ కుమార్
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, వీరి పాలనలో రెట్టింపు పక్కన పెడితే ఉన్నది రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కరెంటు, నీళ్ల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడమే కాక చేసి చూపించామని అన్నారు. తెలంగాణలో రైతులు కోటి ఎకరాలు అదనంగా వ్యవసాయ సాగు చేస్తున్నారనే విషయాన్ని నీతి ఆయోగ్ వెల్లడించిందని వినోద్ కుమార్ అన్నారు. పంట సేకరణలో కేంద్రం విఫలమైందని, 6 నెలలుగా కేంద్రంతో పంటను కొనుగోలు చేయాలని సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని గ్రహించకుండా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరిగా ఢిల్లీలో రాష్ట్ర మంత్రి మండలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులందరం నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. తెలంగాణ యావత్ ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొనబోతున్నారని, రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ అంశాలపై కేంద్రానికి సహకరించాం : సురేష్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ధాన్యం సేకరణ పాలసీ అమలు చేయడం లేదని ఎంపీ సురేష్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయాంశాలపైన కేంద్రానికి సహకరించినా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంట సేకరణ చేయాలని రైతాంగం ఢిల్లీకి వస్తోందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు, చెవులు తెరుస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఎంపీలు రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు టిఆర్ఎస్ నేతలు ధర్నా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఖమ్మం జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బొబ్బిళ్ళ పాటి బాబురావు త‌దిత‌రులున్నారు. పార్టీ అగ్ర నేతలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచనలు చేశారు.

- Advertisement -

ద్వంద్వ వైఖరి సరికాదు : నామా నాగేశ్వరరావు
తెలంగాణ విషయంలో కేంద్ర వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. ఢిల్లీలో కేంద్ర‌మంత్రులు ఒకలా, రాష్ట్ర బీజేపీ నేతలు మరోలా మాట్లాడడం సరికాదని సూచించారు. వారి ద్వంద్వ వైఖరి కారణంగా అమాయక రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఎంపీ నామా గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు బాధ్యతలు కూడా సరిగా నిర్వర్తించాలని ఆయన నొక్కి చెప్పారు. ధాన్యం విషయంలో కేంద్రం విధానాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసంటూ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా పోరాటాన్ని కొనసాగిస్తామ‌న్నారు. సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఇతర నేతలు సభా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పదే పదే క్షమాపణ చెప్పే పరిస్థితి : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణకు ఒకే పాలసీ ఉండాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన చేపట్టామన్నారు. పంజాబ్‌లో ఒకలా, తెలంగాణలో ఒకలా ఉండొద్దన్నదే తమ డిమాండ్ అన్నారు. రైతులు పండించేది వడ్లనన్న ఆయన, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా నేరుగా వడ్లనే సేకరించాలని కోరారు. ఆ తర్వాత ఉప్పుడు బియ్యం చేసుకుంటారా? ముడి బియ్యం చేసుకుంటారా? అనేది వారిష్టమన్నారు. వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని, అందుకే వరి రైతుల కష్టాల గురించి బీజేపీకి పట్టింపు లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తీరు ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమేనన్న మంత్రి, రైతులకు నష్టం కల్గించే వ్యవసాయ చట్టాలు తెచ్చారని గుర్తు చేశారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ రైతులు 13 నెలల పోరాటంతో కేంద్రం నేతలు దిగొచ్చారని, రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. పదే పదే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారని తేల్చి చెప్పారు. రైతులతో పెట్టుకుంటే భవిష్యత్తే ఉండదని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు సంఘాల నేతలు ఈ నిరసన దీక్షకు హాజరవుతారని, ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మద్దతిచ్చే ఏ పార్టీ నేతలైనా వచ్చి నిరసన దీక్షలో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు.

గులాబీ వర్ణం సంతరించుకున్న తెలంగాణ భవన్
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కలిపి 1500 మంది దీక్షకు హాజరావుతారని చెప్తున్నా అంతకంటే రెట్టింపుగానే సభకు నాయకులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఒకరి తర్వాత మరొకరు మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సమయంలో సభా ప్రాంగణానికి వస్తారు? ఎప్పుడు ప్రసంగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీక్షలో పాల్గొనే వారంతా శనివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణా భవన్‌, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగులు తెలుగు వారినే కాక ఉత్తరాది వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఉదయం పది గంటలకు మొదలయ్యే దీక్షలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, కింద కూర్చోవడానికి పరుపులు, మంచినీళ్లు, భోజన ఏర్పాట్లన్నీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement