Saturday, November 23, 2024

డూ..డూ బ‌స‌వ‌న్నా..

  • కనుమరుగవుతున్న గంగిరెద్దుల సాంప్రదాయం
  • అరుదుగా కనిపిస్తున్న గంగిరెద్దుల విన్యాసాలు
  • ఆదరణ లేక వలసపోతున్న కళాకారులు
  • పెరుగుతున్న పట్టణ సంస్కృతి

‘డూ..డూ బసవన్నా ఇటు రారా బసవన్నా.. అమ్మవారికి దండం బెట్టు..అయ్యగారికి దండం పెట్టు.. మన సుబ్బు గారికి దండం పెట్టూ రారా బసవన్నా.. రారా బసవన్నా.. అంటూ..’

గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. గంగిరెద్దులాటలతో పల్లెలన్నీ సందడిగా మారుతాయి. గంగిరెద్దుల సందడి.. డూ..డూ బసవన్నల విన్యాసాలతో గ్రామాలు సందడిగా మారుతున్నాయి. నేడు సరదా సరదా పాటలతో గంగిరెద్దులను ఆడించి ప్రజలను సంతోషపెట్టే మేళగాళ్లు కనుమరుగవుతున్నారు. ఒకప్పుడు దెదీప్యమానంగా వెలిగిన ఈ సాంప్రదాయం.. ప్రస్తుతం అరుదుగా దర్శనమిస్తుస్తోంది. గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు ఇతర ఉపాధిని వెతుక్కోవడంతో క్రమంగా ఈ సాంప్రదాయం కనుమరుగవుతోంది. వాస్తవానికి గంగిరెద్దులాట అనేది ఒక జానపద కళారూపం. ఇది ప్రాచీనమైనది. కానీ, గంగిరెద్దులోళ్ల జీవితాలు చీకటి మయమయ్యాయి. అయితే పట్టణీకరణ గంగిరెద్దుల విన్యాసాల మీద కూడా కత్తిగట్టినట్లే అనిపిస్తుంది. పట్టణాలతో పాటు, పల్లెల్లో కూడా పెరుగుతున్న పట్టణీకరణతో గంగిరెద్దుల విన్యాసాలు మాయమవుతున్నాయి. కనుమరుగవుతున్న సాంప్రదాయాలపై ప్రత్యేక కథనం..
– ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : భారతీయ జీవన విధానంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఆవు ను గోమాతగా భావిస్తే.. ఎద్దు.. నందీశ్వరుడిగా పూజలు అందుకొంటున్నది. ఆ పాడి పశువులే ప్రధాన పాత్రధారులయ్యే జానపద కళారూపం “గంగిరె ద్దులాట. మన సంస్కృతిలోనూ భాగమైంది. పూర్వకాలం నుంచీ మనుగడలో ఉన్న ఈ కళ..పల్లెవాసులతో పాటు పట్టణ వాసులనూ అలరిస్తున్నది. తెలుగు వారి పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రాధాన్యత ఉంది. సంప్రదాయం, సంస్కృతికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. ఆరుకాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో ఈ పండుగ రావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల కళ్లల్లో ఆనందం వెల్లు విరుస్తుంది. గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికే ప్రత్యేకమని చెప్పొచ్చు. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు..అంటూ చెప్పే యజమాని సూచనలకు అనుగుణంగా తల ఊపే బసవన్నలు కొత్త వస్త్రాల అలంకరణలో ఆకట్టుకుంటాయి. ఈ సంప్రదాయం ప్రస్తుతం చాలా అరుదుగా దర్శనమిస్తోంది. వ్యవసాయానికి దన్నుగా ఉండే బసవన్నలు లేకపోవడమే నేడు ఈ పరిస్థితికి కారణమని రైతులు చెబుతున్నారు. పండుగ నెల వచ్చిందంటే బసవన్నలు గ్రామాల్లో తిరుగుతూ.. సందడి చేయడం పరిపాటి. సంక్రాంతికి కొన్ని చోట్ల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. గ్రామ నడిబొడ్డున ఆటలు ఆడించి ప్రజలను ఆనం దింపజేసే వారు. ఇలాంటి గంగిరెద్దుల ఆటకు ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కూడా గంగిరెద్దులను ఆడించేవారు ఉండేవారు.. ప్రస్తుతం వారు కూడా కనుమరుగవుతున్నారు.. ఇప్పుడు ఒక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. కోడె గిత్తలకు శిక్షణ ఇచ్చి సంక్రాంతి పండగకు ప్రత్యేక ప్రదర్శనలు చేస్తుంటారు.
ఆకట్టుకేనే అలంకరణ..
గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు. బట్టలను బొంతలుగా కుట్టి, వాటికి అద్దాలు పొదుగుతారు. మరింత ఆకర్షణ కోసం చెమ్కీ దండలు జతచేసి, మూపురం నుంచి తోక వరకూ కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడుతారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటికి ఆడించే కళాకారులూ ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తిన రంగుల తలగుడ్డ, మూతిమీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్ష ణీయంగా కనిపిస్తారు. సన్నాయి. బూర, డోలు, చేతిలో చిన్న కంచు గంట పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతో పాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు.
ఆడిస్తూ.. ఆశీర్వదిస్తూ..

సంక్రాంతి పర్వదినాల్లో ఇంటింటికీ తిరుగుతూ గంగిరె ద్దులను ఆడిస్తారు. తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటి వాళ్లు హారతి పట్టి పూజిస్తారు. “డూ..డూ బసవన్న.. రారా బసవన్నా..’ అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి. “అమ్మవారికి దండం పెట్టూ..అయ్యగారికి దండం పెట్టు ‘ అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి. “అయ్యగారికి శుభం కలుగుతుందా..? తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా..?’ అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుబ సూచికంగా, నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు. గంగిరెద్దువాళ్లు కూడా ఎద్దు ముందు కాళ్లను ఛాతీమీద పెట్టుకొని ఆడిస్తారు. ఇంటిల్లిపాదినీ తమదైన శైలిలో పొగుడుతూ..ఆశీర్వచనాలు ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement