జనగామ, (ప్రభ న్యూస్): హైదరాబాద్ నుండి జనగామకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ని తప్పించబోయి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పెంబర్తి శివారు కాకతీయ తోరణం సమీపంలో ఇవ్వాల సాయంత్రం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ డిపోకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ బోరబండ నుండి జనగామకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది.
కాగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. అయితే బస్సు పక్కకు దూసుకెళ్తుండగా ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యాదగిరిగుట్ట నుండి సూర్యాపేట వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ ప్రమాద ఘటన చూసి కాన్వాయ్ ఆపారు. ప్రయాణికులకు మంచినీళ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం నుండి చాకచక్యంగా తప్పించి ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్‌ను మంత్రి ప్రశంసించారు.