ప్రభన్యూస్ : ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ ఎద్దులో, బర్రెలో ఉండేవి. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో కాడెద్దులు కనుమరుగవుతున్నాయి. అడపాదడపా అక్కడకక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. వాణిజ్య పంటలు పెరిగిపోవడంతో గ్రామాల్లో ముసలీ ముతక, పిల్లా జెల్లా మాత్రమే ఉంటున్నారు. యువత పట్టణాలకు వలసపోయి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అడపాదడపా యువత పొలాలకు వచ్చి చూసుకుని వెళ్లిపోవడంతో గ్రామాల్లో క్రమేపీ పాడి కనుమరుగవుతోంది. వ్యవసాయానికి యాంత్రీకరణ మొదట్లో బాగానే అబ్బింది. అయితే ఇపుడా యాంత్రీకరణ గుదిబండలా మారింది. డీజిల్, మెయింటినెన్స్ ఖర్చులు పెరగడంతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో సకాలంలో మోస్తరు వర్షాలు కురిసాయి. దీంతో రైతులంతా సాగుకు సన్నద్ధమయ్యారు. నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే పెరిగిన యాంత్రీకరణ వల్ల పెట్టుబడి భారం తడిచి మోపెడవుతోంది. హార్టికల్చర్ హబ్‌గా పేరున్న మండలంలో రోజురోజుకూ కాడెద్దుల సంఖ్య తగ్గిపోతోంది.
గతంలో కుటుంబంలోని మహిళలు పొలం పని అయిపోగానే ఎద్దుల కోసం, పాలిచ్చే పశువుల కోసం మోపు గడ్డికోసి పశువుల కోసం నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చేవారు. ప్రస్తుతం ఎద్దుల స్థానంలో యంత్రాలు వచ్చాయి. జోడెద్దులు మాయమయ్యాయి. రైతుల ఇళ్లలో పాడి కళ తప్పిందని చెప్పవచ్చు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదు అని నానుడి ఉండేది. నేటి యాంత్రిక జీవనంలో యంత్రాలతో పాటు రైతు జీవితం కళ తప్పింది. ఎద్దుల బండ్ల స్థానంలో ప్రస్తుతం గ్రామాల్లో ట్రాక్టర్లు, ఈచర్లు, టాటాఏస్, టెంపో ట్రక్కుల రణగొణ ధ్వని హోరెత్తిస్తోంది. ఎకరా పంటకు 20వేలు ఖర్చవుతోంది. ఎకరాకు ట్రాక్టర్ కిరాయి ఏడువేలు, నాటుకూళ్లు గుత్తకిస్తే 4,500, డిఎపి బస్తా 1300, గట్టు చెక్కడానికి పారపని రెండువేలు దాదాపు 15-20వేలు ఖర్చవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..