ప్రభన్యూస్ : గతంలోనూ భూమ్మీదకు పలురకాల వైరస్ లొచ్చాయి. జనజీవనాన్ని కాకవికలం చేశాయి. లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఆ వైరస్ల ప్రభావం తగ్గుముఖం పట్టిన అనంతరం తిరిగి జనజీవనం యథాస్థితికొచ్చేది. కానీ కరోనా వైరస్ జనజీవన తీరులో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. సుమారు రెండేళ్ళ క్రితం పుట్టుకొచ్చిన ఈ వైరస్ అంచెలంచెలుగా ప్రపంచాన్ని మొత్తం కమ్మేసింది. గతంలో స్పానీష్ ఫ్లూ, కలరా, ప్లేగ్ వంటి అత్యంత ప్రమాదకర అంటురోగాల వ్యాప్తి ఎంత జోరుగా సాగినా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రయాణ సౌలభ్యాలు పెరిగాయి. ఓ దేశం నుంచి మరో దేశానికి జనం రాకపోకలు అధికమయ్యాయి. ఇందు కనుగుణంగానే కరోనా వైరస్ ప్రయాణం కూడా సులభతరమైంది. కొద్ది రోజుల్లోనే అన్ని దేశాలకు ఇది ప్రవేశించగలిగింది. ఆరుమాసాల క్రితం ప్రపంచాన్ని వణికించిన డెల్టా వైరస్ కంటే కూడా ఇది సుమారు ఆరురెట్లు వేగంతో విస్తరిస్తోంది. ఈ లెక్కన నెలతిరగక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ తన ప్రభావం చూపే భయాందోళన పరిస్థితి స్పష్టమౌతోంది.
గతంలో పలు భయంకర వైరస్ల ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజల జీవన విధానాల్లో ఎలాంటి మార్పుండేదికాదు. తిరిగి యదావిధిగా జీవనశైలిని కొనసాగించేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానాల్లోపలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా సౌలభ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కొవిడ్ ప్రభావం మొదలైన తొలినాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. ఆ తర్వాత ఇళ్ళ నుంచే పని చేయడం ప్రారంభమైంది. అంచెలంచెలుగా గత రెండేళ్ళలో ఈ విధానం పుంజుకుంది. ఇప్పుడు ఇళ్ళ నుంచే పని చేయడం ఓ సంప్రదాయమైంది. అందొచ్చిన అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌలభ్యం, కంప్యూటర్లు, క్లౌడ్‌లో నిల్వ, నిక్షిప్త సామర్థ్యాలు, ఆధునిక కాలంలో ప్రపంచంలో ఏ మూలనుండైనా అవసరమైన పనిని పూర్తి చేయగలిగే వెసులుబాట్లను కల్పించాయి.
కోవిడ్ ప్రభావం మొదలైన తొలినాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. ఆ తర్వాత ఇళ్ళ నుంచే పని చేయడం ప్రారంభమైంది. అంచెలంచెలుగా గత రెండేళ్ళలో ఈ విధానం పుంజుకుంది. ఇప్పుడు ఇళ్ళ నుంచే పని చేయడం ఓ సంప్రదాయమైంది. అందొచ్చిన అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌలభ్యం, కంప్యూటర్లు, క్లౌడ్‌లో నిల్వ, నిక్షిప్త సామర్థ్యాలు, ఆధునిక కాలంలో ప్రపంచంలో ఏ మూలనుండైనా అవసరమైన పనిని పూర్తి చేయగలిగే వెసులుబాట్లను కల్పించాయి. తొలుత ఐటీరంగంలో ఈ విధానం అమలైంది. సాఫ్ట్వేర్ రంగం ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య వేగంతో పుంజుకుంటోంది. సాఫ్ట్వేర్ నిపుణులను నియమించుకున్న సంస్థలు భారీగా జీతభత్యాలు చెల్లిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటి నుంచే పని విధానానికి ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలు మద్దతిస్తున్నాయి.
కోట్ల రూపాయల వ్యయంతో కార్యాలయాల నిర్వహణను ఇప్పుడు అదనపు భారంగా భావిస్తున్నాయి. గతంలో ఐటీ హబ్‌లు, ఐటీ కారిడార్లు, సాఫ్ట్వేర్ పార్క్ల్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవి. అక్కడ నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ రంగ సంస్థల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం కల్పించేవి. పలు రాయితీలిచ్చేవి. ఇప్పుడు దేశంలో సాఫ్ట్వేర్ కూడా అతిపెద్ద విదేశీ మారకద్రవ్యాన్ని సాధిస్తున్న రంగంగా మారింది. భవిష్యత్‌లో ఇదే విధానం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. ఇప్పుడున్న కరోనాయే కాదు.. రానున్న కాలంలో ప్రపంచంపై దాడి చేసే ఏ వైరస్ నుంచి తప్పించుకోవాలన్నా వీలున్నంత వరకు ఇల్లు కదలకపోవడమే శ్రేయస్కరం. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇల్లు కదలాలన్న ఆలోచన జనంలో పెరుగుతోంది. అలాగని ఉపాధి అవకాశాలకు కొదవలేకుండా ఆన్లైన్ విధానం ఉపకరిస్తోంది. ఓ వైపు సేవల రంగంలో కూడా ఈ విధానం వేళ్ళూనుకుంది.
గతంలో ఆహార పదార్థాల కోసం హోటళ్ళకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అవే ఇళ్ళకొస్తున్నాయి. నిత్యావసరాల కోసం దుకాణాలకెళ్ళాలి. కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే డెలివరీ చేస్తున్నారు. ఈ విధానాలు భవిష్యత్‌లో మరింత పెరుగుతాయి. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య సగానికి సగం తగ్గుతుంది. రోజూ కార్యాలయాలకెళ్ళే లక్షలాదిమంది ఇళ్ళ నుంచే పనిచేస్తారు. రోజూ విద్యాలయాలకెళ్ళే లక్షలాదిమంది ఇళ్ళనుంచే అభ్యాసం చేస్తారు. మార్కెట్లు, పచారీకొట్లు, హోటళ్ళలో రద్దీ తగ్గుతుంది. ఆస్పత్రుల్లో కూడా నేరుగా వెళ్ళాల్సిన అవసరం తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ సహజంగానే రవాణాపై ప్రభావం చూపిస్తాయి. వాహనాల రాకపోకల అవసరం తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వాలు ఇప్పట్లా ఐటీహబ్‌లు, సాఫ్ట్వేర్ పార్కులు, మెడికల్, ఎడ్యుకేషన్ హబ్లంటూ ప్రత్యేకంగా వందలు, వేల ఎకరాల్ని కేటాయించి అక్కడ భారీ మౌలిక సదుపాయాల్ని కల్పించాల్సిన అవసరముండదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ఈ ప్రభావం ప్రస్పుటమౌతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital