గజ్వేల్ పట్టణానికి సమీపంలోని గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ వద్ద నిన్న (శుక్రవారం) రాత్రి స్కూల్ ఆటో యాక్సిడెంట్‌కి గురయ్యింది. అయితే.. ఈ విషయం స్థానికుల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్లేందుకు అలవాల నరసింహులు (35)కు చెందిన ఆటోను అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం పిల్లలను ఆటోలో స్కూల్ నుంచి మైలారం తీసుకువస్తుండగా నరసింహులు నడుపుతున్న ఆటో అదుపుతప్పి యాక్సిడెంట్‌కు గురయ్యింది.
ఇది గమనించిన గ్రామస్తులు స్కూల్ డ్రైవర్ని కొట్టేందుకు యత్నించడంతో అతడు పారిపోయి విద్యుత్ స్తంభం ఎక్కాడు. స్థానికులు ట్రాన్స్ కో అధికారులను పిలిపించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకుని అక్కడికి పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి స్తంభం నుంచి కిందకు దించారు. మద్యం మత్తులో ఉన్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆటో ప్రమాదంలో సాత్విక (9), రుత్విక (8కు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ఇద్దరు బాలికలు చిన్న గాయాలతో బయటపడ్డారు.