Friday, December 27, 2024

TG – పేదల ఇంటికే ఇందిరమ్మ! అర్హులందరికీ కచ్చితంగా ఇల్లు

ఇందిరమ్మ రాలేదని బాధపడొద్దు
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం
సొంత స్థలం ఉన్నవారికి ఫస్ట్​ ప్రయారిటీ
ఇసుక, స్టీలు తక్కువ ధరకు ఇచ్చేలా చర్యలు
సర్వే ప్రక్రియను వేగం చేస్తున్నాం
33 జిల్లాలకు ప్రత్యేక ప్రాజెక్డు డైరెక్టర్ల ఏర్పాటు
సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం
దిగులుపడొద్దని భరోసా ఇచ్చిన మంత్రి పొంగులేటి

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రత్యేక యాప్‌లో​ వివ‌రాలు పొందుప‌రుస్తున్నారు. అయితే.. పేద‌ల ఇంటికి ఇందిర‌మ్మ వ‌స్తుంద‌ని, ఎవ‌రూ దిగులుప‌డొద్ద‌ని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు. పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఇక‌.. సొంత స్థ‌లం ఉన్న‌వారికి ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఉంటుంద‌ని తెలిపారు. కాగా, సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువగా పెంకుటిళ్లలో ఉంటున్న దరఖాస్తుదారులే ఉండ‌డం విశేషం..

- Advertisement -

9.19 లక్షల మందికి సొంత స్థలాలు..

ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుదారుల ఇంటికి సర్వేయర్లు వెళ్లి పరిశీలిన చేస్తున్నారు. ఇట్లా ఇప్పటిదాకా రాష్ట్రంలో 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్​ ద్వారా సర్వే చేశారు. ఇందులో సుమారు 9.19 లక్షల మందికి సొంత స్థలాలున్నట్లు గుర్తించారు. అయితే.. వారిలో దాదాపు 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో ఉంటున్నట్టు వెల్లడయ్యింది. ఇక.. 2.17 లక్షల మంది సిమెంట్‌ రేకుల ఇళ్లలో.. 1.86 లక్షల మంది జీఐ రేకుల ఇళ్లలో ఉంటున్నారు. శ్లాబ్‌ గృహాల్లో 1.22 లక్షల మంది ఉంటున్నారు. 69,182 మంది మట్టి మిద్దెల్లో, ప్లాస్టిక్‌ కవర్లు, టార్పాలిన్లతో కప్పిన ఇళ్లలో 41,971 మంది ఉంటున్నారు. ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో 34,576 మంది ఉంటుండగా 12,765 మంది పెంకులు పగిలిపోవడంతో టార్పాలిన్‌ కవర్లు కప్పిన ఇళ్లలో ఉంటున్నట్లు వెల్లడైంది.

గుడిసెల్లో ఉన్నవారికే తొలి ప్రాధాన్యం..

తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిళ్లు, గుడిసెళ్లు, మట్టిమిద్దెలో ఉంటున్న దరఖాస్తుదారులకు.. అందులోనూ దివ్యాంగులు, వితంతువులను ప్రాధాన్యక్రమంలో గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.

మహబూబాబాద్‌ జిల్లాలో 59 శాతం పూర్తి..

రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుండడంతో పట్టణాల్లో, గ్రామాల్లో అందరి చూపు యాప్​ సర్వేపైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సంక్రాంతిలోపు 100 శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్వేయర్లు ఉన్నారు. కానీ, కొన్ని జిల్లాల్లో వేగంగా మరికొన్ని జిల్లాల్లో నత్తనడకగా సర్వే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 39శాతం పూర్తి కాగా ఎక్కువగా మహబూబాబాద్‌ జిల్లాలో 59శాతం పూర్తయింది. జనగామ, జగిత్యాల యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో 58శాతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో 30 శాతంలోపే యాప్‌లో లభ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.

హైదరాబాద్​లో 7శాతమే..

ఇందిరమ్మ ఇళ్ల సర్వే అతి తక్కువగా జీహెచ్‌ఎంసీలో 7శాతం మాత్రమే జరిగింది. నగరంలోని ప్రజాపాలన దరఖాస్తులు 10.70 లక్షలు రాగా ఇప్పటివరకు 74,380 మంది దరఖాస్తుదారుల ఇళ్లల్లో సర్వేయర్లు సర్వే చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 33జిల్లాలకు పీడీ (ప్రాజెక్టు డైరెక్టర్లు)లను నియమించింది. వీరంతా నెమ్మదిగా సర్వే సాగుతున్న జిల్లాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రామసభలు, లబ్ధిదారుల ఎంపికపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement