మున్నేరు, ఆకేరు బాధితుల బాధలు వర్ణనాతీతం
ఇన్నాళ్ల సంపదనంతా వరదల పాలు
ఒండ్రు కడిగినా.. వస్తువులు వినియోగించడం కష్టమే
పోయిన వాటి స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలి
అసలే అరకొర ఆదాయం.. మళ్లీ ఇదో అవస్థ
ఆంధ్రప్రభ స్మార్ట్-సెంట్రల్ డెస్క్
ఇన్నాళ్లు సంపదన వరద పాలైంది.. మట్టిలో వెతికి.. ఒండ్రు కడిగి.. శుభ్రం చేసినా ఆ గృహోపకరణాలు వినియోగించడం కష్టమే! అందుకే పోయిన వాటి స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సి వస్తోంది.. అరకొర ఆదాయంతో ఇది సాధ్యమేనా.. అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఏదీఏమైనా వారి జీవనం మళ్లీ మొదటికే వచ్చింది.. ఇదీ మున్నేరు, ఆకేరు వరద బాధితుల బాధలు వర్ణనాతీతం.
మున్నేరు.. ఆకేరు.. వరదపోటుతో…
ఖమ్మంలో మున్నేరు వరదపోటుకు మోతేనగర్, మంచికంటి నగర్, బొక్కల గడ్డ, గొల్లబజార్, వెంకటేశ్వర నగర్, రాజీవ్ స్వగృహ, కవిరాజ్ నగర్, రామన్నపేట, ఆకేరు వరద పోటుకు తిరుమలాయపాలెం ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇక్కడ ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి వ్యథలే. ఇన్నాళ్లు సంపాదన వరద పాలైందని వారి రోదనలు మిన్నంటుతున్నాయి.
వదలని ఒండ్రు..
ఇండ్లలోకి చేరిన బురదను తొలగించే ప్రక్రియ ఎన్ని రోజులు పడుతుందోనని బాధితుల్లో భయం పట్టుకుంది. నదుల్లో నుంచి వచ్చిన ఒండ్రు ఎండిపోవడంతో వాటిని కడగడానికి బాధితులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇక ఇళ్లల నుంచి భరించ లేని దుర్వాసనలు వస్తున్నాయి. ఒండ్రు పట్టిన కొన్ని సామగ్రి కడగకుండా విడిచిపెడుతున్నారు. వాటిని కడిగే బదులు డబ్బులు ఉన్నప్పుడు కొత్తవి కొనుగోలు చేసుకోవడం బెటర్ అని విడిచిపెడుతున్నారు. ప్రతి ఇంటా ఉండే టేబుల్ ఫ్యాన్, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఎన్నో గృహోపకరణ వస్తువులకు ఒండ్రు పట్టింది.
దాతలు ఇచ్చిన దుప్పట్లతో…
సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు ఇచ్చే దుస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. వారి ఇచ్చే దుప్పట్లను కప్పుకొంటున్నారు. క్షణాల్లో చుట్టుముట్టిన నీరుకు భయాందోళన చెంది అనేక మంది కట్టుబట్టలతో వరద ముంపు నుంచి బయటపడ్డారు. దీంతో నాలుగు రోజులుగా అవే దుస్తులు కొందరు కాలం వెళ్లదీస్తున్నారు. వారికి సరిపడిన దుస్తులు లేకపోవడం, కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేకపోవడం తదితర కారణాల రీత్యా నాలుగు రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు.
కొత్తగా అన్ని సమకూర్చుకోవాలి…
మున్నేరు, ఆకేరు బాధితులు కొత్తగా అన్ని సమకూర్చుకోవాల్సి ఉంటోంది. బియ్యం, నిత్యావసర సరుకులను దాతలు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని నిల్వ చేసుకోవడానికి డబ్బాలు, పోపులు కొనుగోలు చేసుకోవడం, వాటిని నిల్వ చేసుకునే పోపుల డబ్బులు కొనుగోలు, తాత్కలికంగా నిద్రపోవడానికి పరుపులు, దుప్పట్లు ఇలా ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కొనుగోలు చేసుకోవాలి. అంటే కొత్తగా కాపురం పెట్టే వారు ఎలా అన్ని సమకూర్చుకోవాలో.. అదేవిధంగా వరద బాధితులు ఇప్పుడు సమకూర్చుకోవాల్సి వస్తోంది. కొత్తగా సమకూర్చుకోకపోతే కుటుంబం నడవదు. ఒకవేళ కుటుంబం నడవాలంటే ఇవి సమకూర్చుకోవాలి. అరకొర ఆదాయంతో ఇవి అన్ని ఎలా సమకూర్చుకుంటామని బాధితులు తలలు పట్టుకుంటున్నారు.
అమ్మో… వాహనాల శుభ్రతకు ఎంత ఖర్చో….
ముంపు నుంచి తేలిన వాహనాల శుభ్రతకు ఎంత ఖర్చు చేయాలో అని బాధితులైన వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అవసరం నిమిత్తం వాహనం సమకూర్చుకుంటారు. అయితే వాటికి మదుపులు పెట్టే ఆదాయం మాత్రం ఉండదు. ఒక్కో వాహనానికి కనీసం రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటోందని బాధితులు లబోదిబోమంటున్నారు.