Tuesday, November 19, 2024

త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్ష.. పదోన్నతులు, బదిలీలకు మార్గదర్శకాలు: సబితారెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌ పరీక్షను నిర్వహిస్తామని, త్వరలోనే టెట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష ఉండే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం-ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించమని, ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షల రీషెడ్యూల్‌ కారణంగా ఇంటర్‌ వార్షిక పరీక్షల తేదీలను పునరాలోచన చేస్తున్నామని, దానిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను ప్రారంభించి, 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతికి, 2024-25లో పదో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని విస్తరిస్తామన్నారు. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడతామన్నారు. మొదటి దశలో 363 మంది రాష్ట్ర స్థాయి కీ-రిసోర్స్‌ పర్సన్లకు, 2683 మంది జిల్లా మెంటర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో విడతలో 16,500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. 4 విడుతల్లో మొత్తం 81,590 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. మొత్తం 19వేల పోస్టులను విద్యాశాఖలో భర్తీ చేసే అవకాశం ఉందన్నాఉ. స్పౌజ్‌ కేసులను పరిశీలిస్తామని ఆమె చెప్పారు.

టెన్త్‌, ఇంటర్‌ షెడ్యూల్‌పై పునరాలోచన…
జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలను ఎన్టిఏ మార్చడంతో ఇంటర్‌, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై గందరగోళం నెలకొంది. ఇంటర్‌, పదో తరగతి పరీక్ష టైం టేబుల్‌ మార్చాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు ఇంటర్‌ పరీక్షలు… మే 11 నుంచి 20 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ మొదట షెడ్యూలు ప్రకటించింది. జేఈఈ షెడ్యూల్‌ కారణంగా ఇప్పటికే ఒకసారి ఇంటర్‌ షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు మార్చింది. ఏప్రిల్‌ 20 నుంచి ఉన్న షెడ్యూల్‌ను 22కు జరిపింది. మళ్లిdప్పుడు జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ల్లో మారడంతో రెండో సారి కూడా ఇంటర్‌ షెడ్యూల్‌ మారే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు ఉంటాయని ఎన్టిఏ ప్రకటించడంతో… ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు ఫెడ్యూలును సవరించింది. పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు జరగుతుండగా జేఈఈ మెయిన్‌ తేదీలను ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు నిర్వహిస్తూ ఎన్టిdఏ మార్చడంతో గందరగోళానికి దారి తీసింది. మరోసారి ఇంటర్‌ పరీక్షలు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఏప్రిల్‌ 21లోపే సాధ్యమా?…
ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షల షెడ్యూలు కూడా మార్చాలని విద్యా శాఖ భావిస్తోంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించాలంటే మే 5 తర్వాత ఇంటర్‌ పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంటర్‌ పరీక్షలకు ఉపాధ్యాయులు కూడా ఇన్విజిలేటర్లుగా వ్యవహరించడంతో పాటు. కొన్ని పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ఒకేసారి జరపలేమని అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక పదో తరగతి పరీక్షలు జరపాలంటే మే నెలాఖరు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మే నెలలో వేసవి తీవ్రత వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ప్రారంభం కాకముందే ఏప్రిల్‌ 21లోపే పూర్తి చేయడం సాధ్యమా అనే కోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇంటర్‌ పనిదినాలు సరిపోక విద్యార్థులు ఇబ్బంది పడతారని భావిస్తన్నారు. కనీసం పదో తరగతి పరీక్షలైనా జేఈఈ మెయిన్‌కు ముందే జరపడానికి అవకాశం ఉంటుందా అనే కోణంలోనూ అధికారులు తర్జన భర్జన చేస్తున్నారు. ఇంటర్‌, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై రేపు స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement