హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో జూన్ 12న జరగనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష రోజే ఆర్ఆర్బీ పరీక్ష ఉండడంతో టెట్ పరీక్షను వాయిదా వేయాల్సిందేనని గత కొన్ని రోజులుగా అభ్యర్థుల నుండి డిమాండ్ తలెత్తుతోంది. మార్చిలోనే టెట్ పరీక్షా తేదీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్బీ సైతం అదే రోజున పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో చాలా మంది అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో ఉద్యోగార్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే టెట్ పరీక్ష వాయిదా వేయాలని సోషల్ మీడియా వేదికగా మంత్రులకు, విద్యాశాఖ అధికారులకు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఓ అభ్యర్థి పరీక్ష వాయిదా వేయాలంటూ దీనిపై మీరే చొరవ తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్.. అభ్యర్థుల అభ్యర్థనను పరిశీలించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్‌పై సబితా ఇద్రారెడ్డి స్పందిస్తూ అధికారులతో మాట్లాడానన్నారు. అయితే టెట్ వాయిదా కుదరదని అధికారులు చెప్పారని ట్విట్టర్లోనే మంత్రి కేటీఆర్‌కు సబిత సమాధానమిచ్చారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే పరీక్ష తేదీలను నిర్ణయించామన్నారు. టెట్ పరీక్షల్లో సుమారు 3.5 లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని, రాష్ట్రంలోని ఇతర పోటీ పరీక్షలకు, మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళిక ఇప్పటికే రేపొందించామని వెల్లడించారు. ఈ సమయంలో పరీక్ష రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రి సబిత తీసుకున్న నిర్ణయంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదోక పరీక్ష రాసేందుకు మాత్రమే అవకాశం ఏర్పడినట్లయింది. దీంతో టెట్ వాయిదాపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థులు నష్టపోనున్నారు.