Friday, November 22, 2024

టెర్ర‌ర్ యాక్టివిటీస్‌లో క‌శ్మీర్ యూత్‌.. ఉపాధి పేరిట ఉగ్ర‌దాడుల‌కు ప్లాన్‌

కశ్మీర్ లోయ‌లో భయాందోళన వ్యక్తమవుతోంది. వలసవాదులను టార్గెట్ చేసుకుని ఇక్క‌డ ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నాయి. రెండు వారాల్లో 11 మంది బ‌ల‌య్యారు. పాకిస్థాన్ అనుబంధ టెర్ర‌రిస్ట్ గ్రూపులైన ల‌ష్క‌రే తోయిబా, హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌, జైషే మ‌హ‌మ్మ‌ద్ ఆగ‌డాలు మితిమీరాయి. ఇట్లాంటి ఘాతుకాలు ఇండియాలోనే కాకుండా ఆఫ్గాన్‌లో కూడా పాకిస్థాన్ చేప‌డుతోంద‌ని ఇంట‌లెజెన్స్ అధికారులు చెబుతున్నారు. లోక‌ల్ యూత్‌ని చేర‌దీసి వారికి ఉపాధి క‌ల్పించే మిష‌తో టెర్ర‌రిస్ట్ గ్రూపుల్లో చేర్చుకుంటున్నార‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో రెండు రోజుల్లో నలుగురు స్థానికేతరులను హత్యచేశారు. శనివారం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, కార్పెంటర్‌ను ఉగ్రవాదులు చంపేశారు. ఆదివారం బిహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. కుల్గాంలోని వాన్‌పోహ్‌ ప్రాంతంలో వలస కూలీలు రెంట్ కు ఉంటున్న గదిలోకి చొరబడిన తీవ్రవాదులు విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు.

14 రోజుల్లోనే ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య 11కు చేరింది. వీరిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. స్థానికేతరులపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లోయలోని వలస కూలీలను తక్షణమే సమీపంలోని భద్రత దళాల స్థావరాలకు చేర్చాలని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్‌ కుమార్‌ అన్ని జిల్లాల పోలీసు విభాగాలకు అత్యవసర ఆదేశాలు పంపారు.

పౌరులపై వరుస దాడులను అక్కడ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అంతకు ముందు జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా రేడియోలో మాట్లాడుతూ ఉగ్రదాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని ప్రకటించారు. సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం కలవరానికి గురిచేస్తోంద‌న్నారు. కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రూ, ట్యాక్సీ డ్రైవర్ మొహమూద్ షఫీ లోనే, స్కూల్ టీచర్లు దీపక్ చంద్, సుపూందర్ కౌర్, వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్‌లను గతవారం హత్యచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement