Saturday, November 23, 2024

సాగ‌ర వీర “తేరా”….

హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌ బైపోల్‌ పాలిటిక్స్‌ హీటెక్కగా, అధికారపార్టీ అభ్యర్ధిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు టీఆర్‌ఎస్‌ సర్కిల్స్‌లో వినబడు తోంది. సీఎం నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటన హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వెళ్ళగా, ముఖ్యనేతలతో పాటు తన వెంట ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డిని కూడా తీసుకెళ్ళారు. సీఎం కేసీఆర్‌ ఎవరికి పదవి కట్టబెట్టాలని నిర్ణయిం చుకున్నా.. తన వెంట తీసుకెళ్లడం ఆనవాయితీ అని, గతంలోనూ ఇలా తన వెంట తీసుకెళ్లిన వారికి పదవులు కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హాలియా బహిరంగ సభలోనే ఉపఎన్నిక అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ టికెట్‌ కోసం
టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యుహాలకు చిక్కకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థి పేరును ప్రకటించడంలో జాప్యం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో పోటీ చేసేందుకు అశావా హుల జాబితా చాంతాడంతా పెరిగిపోయింది. ఇందులో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇంకా అనేకమంది ఆశావహులు టికెట్‌ ప్రయత్నాలు చేశారు. తేరా చిన్నపరెడ్డి వర్సెస్‌ కోటిరెడ్డి మధ్య పోటీ నెలకొనగా, గతంలో అనేకసార్లు జానారెడ్డితో పోటీపడ్డ నేపథ్యం.. స్థానిక పరిస్థితులపై అవగాహన, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న సానుభూతి నేపథ్యంలో ఆయన అభ్యర్ధిత్వం ఖరారయ్యే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫికేషన్‌ నాటికి సమీకరణలు మారితే.. ఇతర పేర్లు పరిశీలనకు రావొచ్చు. ప్రస్తుతం మాత్రం సాగరవీర తేరా అని గులాబీసర్కిల్స్‌లో ప్రచారముంది. మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు జిల్లా నేతల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్న సీఎం కేసీఆర్‌, క్షేత్రస్థాయిలో మూడుపేర్లపై సర్వే కూడా నిర్వహించి నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. సాగర్‌ పాలిటిక్స్‌ ఇపుడు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ నుండి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు బరిలో నిలవనుండగా, బీజేపీ అభ్యర్ధి పై ఇంకా నిర్దారణకు రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement