Friday, November 22, 2024

తాండూరులో టెన్త్ పేపర్ లీక్.. పోలీసుల అదుపులో ఇంటి దొంగ ..

(ప్రభన్యూస్, వికారాబాద్ ప్రతినిధి) : వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరులో ఈరోజు పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. తాండూరులోని ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉదయం 9 గంటల 37 నిమిషాలకు తెలుగు ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. కొద్ది సేపటికి దానిని తొలగించారు. తాండూరులోని ప్రభుత్వ నెంబర్(1) పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు బందెప్ప పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. బందెప్పకు పైన పేర్కొన్న ప్రభుత్వ పాఠశాలలో ఇన్విజిలేటర్(రిలీవర్) గా విధుల్లో ఉన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతో పాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది.

ప్రశ్నాపత్రాలు ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు భద్రత మధ్య తీసుకవస్తారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లో విడదీస్తారు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్ ఫోన్ ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లారనేది తేలాల్సి ఉంది. పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన బందెప్పను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు. గతంలో బందెప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. తాజా ఘటనపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. ఇది ప్రశ్నాపత్రం లీక్ కాదని తెలిపారు. ప్రశ్నాపత్రాల నిర్వహణ లోపంగా పేర్కొన్నారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తే లీక్ అవుతుందని.. పరీక్ష ప్రారంభం తరువాత బయటకు వస్తే నిర్వహణ లోపంగా పేర్కొంటారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement