Saturday, November 23, 2024

Big Story: టెన్షన్​ టెన్షన్​.. ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్​ సీక్రెట్​గా సర్వే..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తున్నారు. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా రానున్న ఎన్నికల్లో టికెట్లు కేటాయించే అవకాశాలు ఉన్నయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. సర్వే రిపోర్టు ఎలా వస్తుందనే దానిపై టెన్షన్‌ నెలకొంది.. ప్రైవేట్‌ సంస్థల ద్వారా అత్యంత రహస్యంగా టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఈ సర్వే చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు తీరు.. ఎమ్మెల్యేల పనితీరు. ఇంకా కొత్త పథకాలు కావాలా అనే దానిపై సర్వే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి :  టికెట్ల కేటాయింపులో సర్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సర్వేకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. గతసారి మాదిరిగానే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి తరుణంలో సర్వేలు ప్రారంభ కావడం ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. సర్వే తమకు అనుకూలంగా వస్తుందా లేక వ్యతిరేకంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సర్వే ఆధారంగా మార్కులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది పాస్‌ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా సర్వే చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సగం నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగతా సగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పథకాల అమలు తీరు.. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సర్వే చేయిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా…క్యాంపు కార్యాలయాల్లో ఎంతమంది ఉంటున్నారనే దానిపై సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సగం మంది ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయాల్లో ఉండటం లేదు. నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మాత్రమే అక్కడ ఉంటున్నారు తప్పిస్తే అక్కడే నివాసం ఉండటం లేదు.

ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో వచ్చిన ప్రజలతో మాట్లాడేందుకు వీలుగా నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్థులో ఎమ్మెల్యేలు ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొందరు మినహా అంతా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ఉదయం లేని నియోజకవర్గాలకు వెళ్తున్నారు. అక్కడే కొందరు మాత్రం ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై కూడా సర్వే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పథకాల అమలుతీరు ఎలా ఉందనే దానిపై సర్వే చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్తగా ఇంకేమైనా పథకాలు అమలు చేయాలా అనే దానిపై సూచనలు కూడా తీసుకుంటున్నట్లు వినికిడి.

పాస్‌ మార్కులు ఎందరికో..
అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న సర్వేలో ఎంతమంది ఎమ్మెల్యేలు పాస్‌ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారి పనితీరు ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ అధికార టీఆర్​ఎస్​కు చెందిన వారే. 2018ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీలను మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. వీళ్లు కూడా 2019లో టీఆర్​ఎస్​లో చేరిపోయారు. అందరూ అధికార ఎమ్మెల్యేలే కావడంతో ఇందులో ఎంతమంది ప్రజల మెప్పులు పొందుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ నియోజకవర్గాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సర్వేలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉత్తీర్ణత సాధిస్తారనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సగం పట్టణ నియోజకవర్గాలు…మిగతా సగం నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో నాలుగు గ్రామీణ నియోజకవర్గాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాద్‌నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలు గ్రామీణ నియోజకవర్గాలు కాగా మిగతావి అన్నీ పట్టణ నియోజకవర్గాలే. మహేశ్వరంలో కందుకూరు, మహేశ్వరం మండలాల మినహా మిగతా ప్రాంతమంతా పట్టణ ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు. మొత్తం మీద సర్వే రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది.

గత పరిస్థితులు పునరావృతమయ్యేనా..
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పలుమార్లు సీఎం కేసీఆర్‌ ప్రైవేట్‌ సంస్థల ద్వారా సర్వే చేయించారు. ఇందులో ఎమ్మెల్యేలకు మార్కులు కూడా ఇచ్చారు. తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. రెండవసారి మంచి మార్కులు సాధించిన వారిని మెచ్చుకున్నారు కూడా.. ఎప్పటికప్పుడు పనితీరు మార్చుకోవాలని హెచ్చరికలు చేశారు. పలుమార్లు సర్వే చేయించినా ముగ్గురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిపోర్టు రావడంతో వారికి 2018 ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదు. మేడ్చల్‌లో సుధీర్‌రెడ్డి, వికారాబాద్‌లో సంజీవరావు, మల్కాజ్‌గిరిలో కనకారెడ్డికి టికెట్టు నిరాకరించారు. వీరి స్థానంలో మేడ్చల్‌లో చామకూర మల్లారెడ్డి, వికారాబాద్‌లో డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంత్‌రావుకు టికెట్టు కేటాయించారు. ఈ ముగ్గురూ విజయం సాధించారు.

- Advertisement -

మేడ్చల్‌ నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చామకూర మల్లారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సర్వేలపై సీఎం కేసీఆర్‌ పూర్తి నమ్మకంతో ఉంటారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరిపై వేటుపడనుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఎంతమందికి తిరిగి టికెట్టు వస్తుంది.. ఎంతమందికి మొండి చేయి చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. సర్వేలు ప్రారంభం కావడంతో కొందరు ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఈసారి కూడా సిట్టింగ్‌లకు టికెట్టు ఇస్తామని సీఎం ఇప్పటికే హామి ఇచ్చిన విషయం తెలిసిందే. సర్వేలో పనితీరు బాగా లేకపోతే మాత్రం వారికి టికెట్టు దక్కడం కష్టమే. మొత్తం మీద నియోజకవర్గాల్లో అత్యంత రహస్యంగా కొనసాగుతున్న సర్వేలో ఎవరికి పాస్‌ మార్కులు వస్తాయనే దానిపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement