Sunday, November 24, 2024

Cold Waves: చలి గుప్పిట్లో తెలంగాణ.. ఆ జిల్లాలో రెడ్ అలర్ట్!

తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత వారం రోజులుగా చలి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పడిపోతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయింది. దీంతో ఆ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత 125 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా, రంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, తదితర జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. రాబోయే మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూ జ్వరాలు, నిమోనియా, ఆస్తమా తదితర వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement