ఒక నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు మంత్రి పీఆర్‌వో డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే చెడ్డపేరు వస్తుందని కూడా ఆ పీఆర్‌వో చెప్పడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తంగా 3.53 నిమిషాల నిడివి ఉన్న రెండు ఆడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కరీంనగర్‌లో అనుమతి లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఒక కేసులో అరెస్ట్ అయిన బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్ పీఆర్‌వో మల్లికార్జున్ మంతనాలు చేసినట్టు తెలుస్తోంది.
తాను ఇప్పుడే ఏసీపీతో మాట్లాడానని, స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని ఓ వ్యక్తికి హామీ ఇచ్చారు. స్టేషన్‌కు వెళ్లి మంత్రి పీఏ మల్లికార్జున్ సార్ చెప్పాడని పోలీసులకు చెబితే బెయిలు ఇస్తారని ఆ ఆడియోలో పేర్కొన్నారు. అయితే, ఇందుకు కొంతమొత్తం ఖర్చవుతుందని, ఏసీపీ, సీఐలకు కూడా అడ్జస్ట్ చేయాలని మల్లికార్జున్ చెప్పుకొచ్చారు.
డబ్బులు మాత్రం వెంటనే ఇవ్వాలని, ఎంత అనేది తాను తర్వాత చెబుతానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని, చెబితే పోలీసులకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఆడియో వైరల్ కావడంతో మంత్రి గంగుల స్పందిస్తూ.. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పీఆర్‌వోను విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. ఈ విషయమై డీసీపీ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేయించనున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.