Thursday, November 7, 2024

తెలంగాణ వ‌ర్శిటీల విసీల తీరే వేర‌యా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యావేత్తలు, మేధావులు, వ్యాపార వేత్తలను అందించాల్సిన యూనివర్సిటీలు నిత్యం ఏదోక వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తెలంగాణ యూని వర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ తో పాటు మిగిలిన యూనివర్సిటీల్లో పాలకమండళ్లలో వైస్‌ చాన్సిలర్లు తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే సర్క్యులర్లతో ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేసినా వారి తీరు మాత్రం మారడంలేదనే విమర్శలు వినిపిసు ్తన్నాయి. అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు హెచ్చరించినా పలువురు వీసీలు మాత్రం తమ తీరు ఇంతే అన్నట్లుగా సాగిపోతున్నారు. అయితే పలువురు వీసీలు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నప్పటికీ మరికొంత మంది వీసీలు తీసుకునే నిర్ణయాలు, విధానాలు మాత్రం నిత్యం వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా తీరు ఉన్నతాధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల జరిగిన తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో వీసీ రవీందర్‌కు కాలేజీయేట్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. యూని వర్సిటీ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా ఓ మహిళా ప్రొఫెసర్‌ను నియమ కానికి వర్సిటీ పాలకమండలి అనుమతి లేదంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై వీసీ వారిస్తుండటంతో నవీన్‌ మిట్టల్‌ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్సిటీ ఈసీ అనుమతి తీసుకోకుండా ఎలా నియామకాలు, అభివృద్ధి పనులు చేపడతారంటూ వీసీని ఆయన నిలదీసినట్లు తెలిసింది. గతంలోనూ పలు వివాదాస్పద నిర్ణయాలతో తెలంగాణ యూనివర్సిటీ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.
తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ముగ్గురు రిజిస్ట్రార్లు మారారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఇందుకు అప్పటి రిజిస్ట్రార్‌ కనకయ్యను బాధ్యుడిగా చేస్తూ పదవీ బాధ్యతల నుంచి తప్పించి, సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించింది. అయితే అప్పట్లో జరిగిన నియామకాలను రద్దు చేసింది. తర్వాత యాదగిరి స్థానంలో కొత్త రిజిస్ట్రార్‌గా శివకుమార్‌ వచ్చారు. ఈయన తర్వాత మహిళా ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈమె నియామకం చెల్లదని ఇటీవల జరిగిన ఈసీలో తేల్చడంతో తాజాగా వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా యాదగిరి గురువారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిసింది. అలాగే వీసీ హయాంలో గతంలో నియమించిన దాదాపు 130 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పదోన్నతు లను కూడా రద్దు చేశారు. రెండు నెలల పాటు ప్రతి వారం ఈసీ సమావేశం నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ ఒక్క యూనివర్సిటీయే కాదు మరికొన్ని యూనివర్సిటీలు జారీ చేస్తున్న పలు సర్క్యులర్లు తరచూ వివాదాస్ప దమవుతున్నాయి. దీంతో విద్యార్థులు రోడ్డెక్కా ల్సిన పరిస్థితి వస్తున్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అకడమిక్‌ ప్రమాణాల గురించి పట్టించుకోకుండా అకడమికేతర అంశాలపై పలువురు వీసీలు దృష్టిసారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్‌ బాధ్యతలు చేపట్టగానే క్యాంపస్‌లోకి వచ్చే వాకర్స్‌ ఫీజు చెల్లించాలని జారీ చేసిన సర్క్యులర్‌ అప్పట్లో కలకలం రేపింది. వర్సిటీలో బౌన్సర్లను పెట్టుకోవడం వర్సిటీ విద్యార్థులకు తీవ్ర ఆగ్రహాన్ని కల్గించింది. అధ్యాపకుల బాండ్‌ పేపర్ల వివాదం పెద్ద దుమారమే రేపింది. కోఠి, నిజాం, సైఫాబాద్‌లో చదివే డిగ్రీ విద్యార్థుల హాస్టళ్ల మూసివేత, కాంట్రాక్ట్‌ లెక్చరర్ల ఓరల్‌ ట్రాన్స్‌ ఫర్స్‌ లాంటి నిర్ణయాలు విద్యార్థి సంఘాల ఆందోళనకు దారితీశాయి. పార్ట్‌ టైం టీచింగ్‌ పోస్టుల బర్తీకి నిర్వహించిన రాత పరీక్ష, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయ విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశాయి. యూనివర్సిటీ ఆవరణలో ఎలాంటి నిరసన కార్యక్రమాలను చేపట్టొద్దనే నిర్ణయంపై అప్పట్లో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అతిపెద్ద వర్సిటీ కాకతీయ వర్సిటీయే. ఆ వర్సిటీ వీసీగా ప్రొ. టి.రమేష్‌ నియామకంపై అప్పట్లో వివాదం కొనసాగింది. ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించారంటూ హైకోర్టులో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. వీసీగా బాధ్యతలు చేపట్టిన మొదటి నాలుగు నెలల్లోనే ఇద్దరు రిజిస్టార్లు రాజీనామా చేశారు. వీసీ ఏకపక్ష విధానాల వల్ల పరిపాలన పదవుల్లో కొనసాగేందుకు సీనియర్‌ ప్రొఫెసర్లు ముందుకు రావడంలేదనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. అంతేకాకుండా వీసీగా బాధ్యతలు చేపట్టాక ట్యూషన్‌ ఫీజులు భారీగా పెంచారు. దీంతో వీసీ చాంబర్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించినా వెనక్కి తగ్గలేదు. వర్సిటీలో కోర్సుల బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అదేవిధంగా జేఎన్టీయూలో విద్యార్థుల క్రెడిట్‌ బేస్డ్‌ డిటెన్షన్‌ వివాదం పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై నిర్ణయాలపై విద్యార్థులు వర్సిటీ ముందు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విధానం వల్ల తాము నష్టపోతామని గవర్నర్‌కు విద్యార్థులు సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. అయితే గవర్నర్‌ ఆదేశాలతో ఆ విధానాన్ని అప్పట్లో జేఎన్టీయూ అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఇలాగే మిగతా వర్సిటీలు ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల ఆగ్రహానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement