ఏపీ, తెలంగాణ మధ్య రేగిన జలవివాదం మరింత ముదురుతోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయగా.. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని ఆపాలని చేసిన వాదనలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తప్పుబట్టింది.
ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ ఎస్ఈసీ తెలిపారు. పదేళ్లుగా ఏప్రిల్, మే మాసాల్లో 834 అడుగుల నీటి మట్టాన్ని ఉంచలేదని తెలిపారు. బేసిన్ వెలుపల నీటి తరలింపునకు ఏపీ 854 అడుగులు ఉండాలంటోందని ఆరోపించారు. కృష్ణా డెల్టా కోసం 760 అడుగుల వరకు నీరు వదిలేలా 2013లో మెమో ఇచ్చారని లేఖలో వివరించారు. ఏపీ రెండేళ్లుగా వరుసగా 170 టీఎంసీలు, 124 టీఎంసీలు తరలించిందని తెలిపారు. చెన్నై తాగునీటి కోసం ఏపీ 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ విద్యుత్పాదన వల్ల ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదన నిరాధారం అని చెప్పారు. 50 శాతం నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్ఈసీ పేర్కొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు లోబడి, ప్రణాళిక సంఘం నివేదిక అనుసరించే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు కేసీఆర్ అంటే అభిమానం: ఏపీ డిప్యూటీ సీఎం