Friday, November 22, 2024

Telangana: తెలంగాణలో ‘షిండే మోడల్’​ ప్రభుత్వం ఏర్పాటు.. తనకు ప్రతిపాదన పంపారన్న కవిత

తెలంగాణలో ‘షిండే మోడల్’ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ తనకుప్రతిపాదన పంపిందని, అయితే తాను దానిని తిరస్కరించానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు కూతురు కవిత శుక్రవారం పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలి సభ్యురాలు కవిత విలేకరులతో మాట్లాడుతూ.. బీజెపీకి చెందిన “స్నేహితులు” ఈ ప్రతిపాదనతో తనను సంప్రదించారని చెప్పారు. ‘షిండే మోడల్’ అనేది మహారాష్ట్రలోని శివసేనలో ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలోని తిరుగుబాటుకు సూచన.. ఆ తరువాత అతను బీజేపీ సహాయంతో ముఖ్యమంత్రి అయ్యారు.

‘‘బీజేపీ స్నేహితులు, బీజేపీకి చెందిన స్నేహపూర్వక సంస్థలు నన్ను పార్టీలో చేరాలని కోరుతూ నా వద్దకు ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ ప్రతిపాదనను షిండే-మోడల్ అంటారు. తెలంగాణ ప్రజలు మా పార్టీలకు, సొంత నాయకులకు ద్రోహం చేయరని నేను చెప్పానని, బ్యాక్‌డోర్‌ ద్వారా కాకుండా సొంత బలంతో మేము నాయకులు అవుతాం’ అని ఎమ్మెల్స కవిత అన్నారు. తాము వారి ప్రతిపాదనను చాలా సున్నితంగా తిరస్కరించామని, ఆ తర్వాత ఏం చేస్తారనేది వేరే కథ అని చెప్పారు. తాము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటామని, ఎట్లాంటి సమస్యలనైనా ఎదుర్కొంటాం ”అని కవి  స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) నాయకుల సమావేశంలో సీఎం కేసీఆర్ బీజేపీలో తన కూతురును చేర్చుకోవడానికి ఎర చూపినట్టు చెప్పిన రెండు రోజుల తర్వాత కవిత ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. కేసీఆర్ వాదనను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. బీజేపీలో చేరాలని కేసీఆర్ భావించినా.. తమ పార్టీ అంగీకరించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇక.. పార్టీలో చేరేందుకు కవిత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను సంప్రదించారని అరవింద్‌ చెప్పడంపై కవిత స్పందించారు. తను వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తమ పార్టీ.. రేపు జాతీయ స్థాయిలో పని చేస్తుందని ఆమె అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement