Friday, November 22, 2024

ఎన్నిక‌ల వేళ‌ల ఢిల్లీలో ప‌ద‌వి బెట‌ర్ – ఆశ‌ల ప‌ల్లకిలో తెలంగాణ నేత‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లంతా హస్తినపై గురిపెట్టారు. పార్టీలో కీలక పదవులు దక్కించు కునేందుకు పావులు కదుపుతున్నారు. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు తమకే దక్కుతాయన్న ఆశల్లో సీనియర్లు విహరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత కమిటీ- అయిన వర్కింగ్‌ కమిటీ-(సీడబ్ల్యూసీ)లో చోటు- దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధిష్టానం పెద్దలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని పదవులను పొందేందుకు లాబీయింగ్‌ చేస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికలో కాంగ్రెస్‌ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో సీనియర్లలో కలవరం మొదలయింది. కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణాయక కమిటీ-గా పేరొందిన సీడబ్ల్యూసీ సభ్యుల నియా మకానికి ఎన్నికలు నిర్వహిస్తే పోటీ- చేయాలని సీనియర్లు సిద్ధమయ్యారు. సీడబ్ల్యూసీ సభ్యుల నియామకానికి ఎన్నికలు జరపకుండా ఎంపిక చేయాలని నిర్ణయించడంతో నేతలు ఖంగుతిన్నారు.

సుదీర్ఘకాలంగా ఎదురుచూపు
సీదబ్ల్యూసీలో స్థానం కోసం తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు, నేతలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. పార్టీలో సీడబ్ల్యుసీ కీలకం కావడంతో ఎలాగైనా ఈ పదవిని దక్కించుకుని సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు- జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం తెలంగాణ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయనతో సీనియర్లకు ఏ మాత్రం పొసగడం లేదు. రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ-లో పదవులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లో జాతీయ స్థాయి పదవులపై చాలా మంది ఆశలు పెట్టు-కున్నా ఆ పదవులు ఎవరికి వరిస్తాయో తెలియక సతమతమవుతున్నారు.

ఆశల పల్లకిలో…
పీసీసీ మాజీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్‌ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్‌ను పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోమటిరెడ్డి వ్యతిరేకించడంతో పాటు- అధినాయకత్వంపై విరుచుకుపడ్డారు. సీడబ్ల్యుసీ పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ నేతలు పార్టీ అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. సీడబ్ల్యూసీ పదవులు దక్కించుకునేందుకు ఒక వైపు సీనియర్లు లాబీయింగ్‌ చేస్తుంటే మరో వైపు వారిని వ్యతిరేకిస్తున్న మరో వర్గం వారికి కీలక పదవులు దక్కకుండా పావులు కదుపుతున్నట్టు- సమాచారం. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం ఒక వైపు జోరుగా సాగుతుండగా ఆయన సీడబ్ల్యుసీ పదవిని ఆశిస్తున్నట్టు- చెబుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ బాధ్యులుగా నియమిస్తారని, ఈ ఏడాది చివరిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం తాను హుజూర్‌నగర్‌, సతీమణి పద్మావతి కోదాడ నియోజకవర్గాల్లో పోటీ-కి దిగుతున్నందున ఈ ఏడాదంతా ఎన్నికల ప్రచార వ్యూహంలో ఉండాల్సిన పరిస్థితి ఉందని, అందుకే తనకి వర్కింగ్‌ కమిటీ- సభ్యునిగా ఎంపిక చేయాలని ఆయన పార్టీ పెద్దలను కోరినట్టు- సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి మాత్రమే సీడబ్ల్యుసీలో చోటు- దక్కుతుందన్న ప్రచారం జరుగుతుండడంతో అది ఎవరికి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. సీడబ్ల్యూసీ సభ్యుల నియామకానికి ఎన్నికలు జరపడం లేదని.. ఎంపిక ఉంటు-ందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్లీనరీ వేదికగా ప్రకటించడంతో ఆశావహుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యుసీలో ఒకరినే నియమిస్తారన్న సంకేతాలు రావడంతో ఆ పదవి ఏ రాష్ట్రానికి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ షురూ అయింది. ఈ ఏడాది చివరలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ రాష్ట్రం వారికే పదవి వరిస్తుందని భావిస్తున్నారు. ప్లీనరీ నిర్వహణకు ఏఐసీసీ నియమించిన కమిటీ-ల్లో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకులను అత్యధికంగా ఎంపిక చేయడంతో సీడబ్ల్యూసీ పదవి తెలంగాణకే వస్తుందన్న ధీమాతో రాష్ట్ర నేతలున్నారు. వర్కింగ్‌ కమిటీ- ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో టి.సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. ఐఎన్‌టీయుసీ కోటాలో సంజీవరెడ్డి ఆహ్వానితులుగా ఉన్నారు. కొత్త కమిటీ-లో వీరినే కొనసాగిస్తారా? వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా తన వర్గానికి కీలక పదవులు దక్కేలా వ్యూహం రచించినట్టు- సమాచారం. సీడబ్ల్యూసీ సభ్యునిగా మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలీ, మాజీ ఎంపీ మల్లు రవిలలో ఒకరికి ఇవ్వాలన్న ప్రతిపాదన అధినాయకత్వం ముందుంచినట్టు- సమాచారం. ఆదివాసీ, మహిళా కోటాలో ఎమ్మెల్యే సీతక్కను మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని రేవంత్‌ సూచించినట్టు- చెబుతున్నారు. ఆదివారంతో మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు ముగియడంతో జాతీయ స్థాయి పదవులు ఆశిస్తున్న సీనియర్లు ఢిల్లీలోనే కొన్ని రోజులు మకాం వేసి అధినాకత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement