Tuesday, November 26, 2024

సేద్యంలో అగ్రస్థానం… ప్రాజెక్టు నిర్మాణంతో పెరిగిన సాగు విస్తీర్ణం..

దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు తనదైన శైలిలో రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి దిశగా వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం 15.8 వృద్ధిరేటు నమోదు చేసుకుంది. ఇది జాతీయ సగటు రేటు 8.5 శాతం కన్నా ఎక్కువ. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల విలువలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 2014 నుంచి రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వరి సాగు, ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్‌లో గణనీయమైన మార్పులు రావడంతో ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 2014 నాటికి రాష్ట్రంలో కోటి 34 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా అది ప్రస్తుతం 2.3కోట్ల ఎకరాలకు పెరిగింది. వీటితో పాటు మరో 11.50లక్షల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు సాగవుతున్నాయి. 2014-15 సమయంలో 24,29, 536 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, ఇది 2021 నాటికి కోటి 41,878.4 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గతంలో 45లక్షల టన్నులు మాత్రమే ధాన్యం ఉత్పత్తి ఉండగా, 2021నాటికి 3 కోట్ల టన్నులకు చేరింది. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి రూ.97,924 కోట్లతో 556 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.

పంటసాగు నుంచి ఉత్పత్తి వరకు..

ఏఏ పంటలు సాగు చేసుకోవాలన్న అంశాలపై కూడా వ్యవసాయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సమాచారాన్ని చేరవేస్తోంది. దీంతో రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసి మొదటి స్థానంలో నిలిచింది. సాగైన పంటలన్నింటికీ మార్కెటింగ్‌ను కల్పించడంలోనూ వ్యవసాయ శాఖ మెరుగైన పనితీరును కనబరచడంతో రైతులకు ఉత్పత్తుల విక్రయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడంలేదు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా రైతాంగం కోసం తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నది. పంటల పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద 8 విడతల్లో రూ.50 వేల కోట్లు ఖర్చు చేసింది.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పెరిగిన భూగర్భ జలాలు..

రాష్ట్రంలో వేగంగా నిర్మితమైన ప్రాజెక్టు లతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్లు, బావుల్లో పుష్కలమైన నీరు అందుబాటులోకి వచ్చింది. నీటి సౌకర్యం మెరుగుపడడంతో పాటు ప్రభుత్వం వ్యవ సాయ విద్యుత్‌ మౌలిక సదుపాయాల కోసం రూ.28,473 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భాగంగా ఏటా రూ.10,500 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రంలోని 25 లక్షల వ్యవసాయ మోటార్లకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఏడేళ్లలో 43.26 లక్షల మంది రైతులకు రూ. 857.27 కోట్లతో 38.34లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రాయితీపై ప్రభుత్వం అందించింది. విత్తనాలతో పాటు ఎరువుల విషయంలోనూ వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తతగా ఉండడంతో 2014-15లో 25.36లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేయగా, 2021వరకు 45శాతం పెరిగి 36.87 శాతానికి చేరింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement