దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసే కార్యక్రమం తెలంగాణలో ప్రారంభం కానుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ ప్రాజెక్టును చేపడుతోంది. వికారాబాద్‌లో శనివారం దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనిని వికారాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం ఐటీ శాఖ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్‌నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేస్తున్నది.
వికారాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నెలరోజులపాటు దీనికి సంబంధించిన ట్రయల్‌రన్ జరగనుంది. దీనికోసం మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా డ్రోన్లు ఎంత దూరం వెళ్లగలుగుతాయి, బరువైన పేలోడ్స్ తీసుకెళ్తాయి వంటి అంశాలను నెలరోజులపాటు పరిశీలిస్తారు. మొదటి దశలో ‘కనిపించేంత దూరం’లోని (విజువల్ లైన్ ఆఫ్ సైట్ -వీఎల్‌వోఎస్) ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్లు సప్లై చేస్తారు. ఆ తర్వాతి దశలో ఎంపిక చేసిన మార్గాల్లో 9-10 కిలోమీటర్లలోని ప్రదేశాలకు (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్-బీవీఎల్‌వోఎస్) మెడిసిన్ సప్లై చేస్తారు. తద్వారా దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీతో మెడిసిన్ సప్లై చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కనుంది.
మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ద్వారా… జిల్లా కేంద్రాల్లోని ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమూల ప్రాంతంలోని గ్రామాలకు గంటల వ్యవధిలో మందులు,వ్యాక్సిన్లను తరలించవచ్చు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కేవలం గంటలో వ్యాక్సిన్లు, మందులు తదితర అత్యవసరాలను డ్రోన్ల సహాయంతో సరఫరా చేయవచ్చునని చెబుతున్నారు. ఇందులో ఉపయోగించే డ్రోన్లు భూమికి 500 నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించనున్నాయి.
ఇది కూడా చదవండిః నేడు బీజేపీ పదాధికారులతో బండి సమావేశం