Saturday, November 23, 2024

టీకా కటకట.. తెలంగాణకు 7.5 లక్షల వ్యాక్సిన్లు

వ్యాక్సిన్ల కొరత తెలంగాణలో టీకాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. తమకు వ్యాక్సిన్‌ అందుతుందో లేదోనని లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత టీకా అంటే అంతగా ఆసక్తి చూపనివారు.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం ఎగబడటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకాలు రానున్నాయి. ఇవాళ మరో 7.5 లక్షల డోసులు వస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. వాటిలో 6.5 లక్షలు కొవిషీల్డ్​ కాగా.. మరో లక్ష కొవాగ్జిన్​ టీకాలు ఉన్నట్లు ఆయన వివరించారు. వ్యాక్సిన్ ల కొరత కారణంగా గత ఆదివారం టీకా పంపిణీ ఆగిపోయింది. అయితే, ఆదివారం రాత్రి 2.7 లక్షల వ్యాక్సిన్లు రాగా… సోమవారం 1.63 లక్షల మందికి టీకాలు వేశారు.

మరోవైపు ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్‌ పెరగడంతో అవసరాల మేరకు టీకాలు సరఫరా చేయడం కేంద్రానికి కూడా ఇబ్బందిగా మారింది. అయితే ఆదివారం కేంద్రం నుంచి రాష్ట్రానికి 2.70 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో సోమవారం టీకా కార్యక్రమం కొనసాగనుంది. కానీ ప్రస్తుతం వచ్చిన టీకాలు ఏమూలకూ సరిపోవని ప్రస్తుత రోజువారీ టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల్లో కొత్త వారికి మొదటి డోస్‌ నిరాటంకంగా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రెండో డోస్‌ వారికి గడువులోగా టీకాలు ఇవ్వాల్సి ఉండటంతో ఏంచేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది.  

గత వారం రోజులుగా రోజుకు సరాసరి లక్షన్నర టీకాలు వేస్తున్నారు. ఒక రోజైతే మొదటి, రెండో డోస్‌ కలిపి దాదాపు 1.67 లక్షల వరకు కూడా వేశారు. జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 29,59,334పై మందికి కరోనా టీకాలు వేశారు. అందులో 25,90,245 మందికి మొదటి డోస్‌ వేయగా, 3,69,089 మందికి రెండో డోస్‌ వేశారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో రెండో డోస్‌ తీసుకునేవారి సమయం ఎప్పుడో గడిచిపోయింది. వారిలో ఇప్పుడు చాలామంది రెండో డోస్‌ కోసం వస్తున్నారు. ఇక 45 ఏళ్లు పైబడిన వారు కూడా ప్రతీ రోజూ రెండో డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే పది రోజుల్లో రోజుకు సరాసరి మొదటి డోస్‌ తీసుకునేవారు లక్షన్నర మంది, రెండో డోస్‌ తీసుకునేవారు సరాసరి దాదాపు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం వచ్చే పది రోజుల్లో 18 లక్షల టీకాలు అవసరం అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement