Friday, November 22, 2024

Telangana Ten Years Progress – కొంగొత్త‌గా విశ్వ‌న‌గ‌రం – ద‌శ దిశ‌లా తెలంగాణ కీర్తి

స్వరాష్ట్రంలో రూపురేఖలు మార్చుకున్న‌ భాగ్య‌న‌గ‌రం
హైదరాబాద్ సిగలో కీర్తి కిరీటాలెన్నో
తెలంగాణ సెక్రెటేరియెట్​ నిర్మాణం మహాద్భుతం​
మరో గొప్ప నిర్మాణంగా పోలీసు కమాండ్​ కంట్రోల్​
అమరవీరుల స్మారక చిహ్నం అదుర్స్​
అత్యంత ఎత్తైన విగ్రహంగా బాబా సాహెబ్​ అంబేద్కర్​ విగ్రహం
ఐకానిక్​గా మారిన ఎన్నో బిల్డింగులు
పర్యాటక ఆకర్షణ.. చరిత్ర మురిసేలా మన భవంతులు
టూరిజం స్పాట్​లుగా నిలుస్తున్న ఎన్నో ప్రదేశాలు
జర్మన్​ టెక్నాలజీతో కేబుల్​ బ్రిడ్జి నిర్మాణం
ఎనిమిది దేశాల ఇంజినీర్లతో పనులు
చిమ్మ చీకట్లకు చెక్​.. నిరంతరం విద్యుత్​ సప్లయ్​
మెట్రో రైలు రాక.. గజిబిజి పరుగులకు ఊరట
రంగారెడ్డి, హైదరాబాద్​కు అనుబంధంగా మేడ్చల్​ జిల్లా
తెలంగాణలో ఉద్యమాల గడ్డకు ఎంతో విశిష్టత

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా హైద‌రాబాద్‌కు ఓ గొప్ప ఖ్యాతి ఉంది. ఒక్కో రంగంలో త‌న స్థాయిని పెంచుకుంటూ విశ్వ‌న‌గ‌రిగా ఎదుగుతోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డగా చ‌రిత్ర సృష్టిస్తే.. ఇక‌, స్వరాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి పథంలోనూ పరుగులు పెడుతోంది. 400 ఏళ్లకు పైగా నేప‌థ్యం ఉన్న చారిత్ర‌క భాగ్యనగరికి ఈ పదేండ్లలో మరిన్ని సొబగులు జతకూరాయి. విశ్వనగరికి అడుగులు పడ్డాయి. అందులో మెట్రో రైలు, కేబుల్ బ్రిడ్జి, ఐకానిక్ బిల్డింగ్స్‌, అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నం, బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వంటివి ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న త‌రుణంలో.. మ‌రోసారి మ‌న ఘ‌న‌తను మ‌న‌నం చేసుకుందాం..

మెట్రో ఉరుకులు.. గ‌జిబిజి ప‌రుగుల‌కు బ్రేక్‌..

2017 నవంబర్ 30 నుంచి అధునాతన ప్రజారవాణా వ్య‌వ‌స్థ అయిన మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి ఏపీలోనే మెట్రో పనులు మొదలెట్టినా.. తెలంగాణ వచ్చాకే ఆ ప‌నులు పూర్త‌య్యాయి. 69.2 కిలో మీటర్ల మెట్రో మార్గంలో నిత్యం 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. ఈ పది సంవత్సరాల వ్యవధిలో ఒక్క కిలోమీటరు కూడా విస్తరణ చేపట్టకపోవడం, పాతబస్తీ మెట్రోని అటకెక్కించడం హైదరాబాద్‌ వాసులను నిరుత్సాహపర్చింది.

నిరంతర విద్యుత్ .. చిమ్మ చీక‌ట్ల‌కు చెక్‌..

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే కాదు.. అంతటా క‌రెంటు కోత‌లు విపరీతంగా ఉండేవి. ఎప్పుడు క‌రెంటు వ‌స్తుందో, ఎప్పుడు పోతుందో తెలియ‌ని స్థితి ఉండేది. వ్య‌వ‌సాయం అంతా బోరు బావుల‌పై ఆధార‌ప‌డి ఉండ‌డం వ‌ల్ల విద్యుత్ కోసం రైతులు పొలాల వ‌ద్ద‌నే కాప‌లా కాసేవారు. కరెంట్ కొరత కారణంగా పరిశ్రమలకు కొన్నిరోజులు పవర్‌ హాలిడే ఇచ్చేవారు. గృహాలకు కోతలు ఉండేవి. ఇలాంటి ప‌రిస్థితికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కొద్దినెలల్లోనే కోతలను పూర్తిగా ఎత్తివేశారు. విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర కరెంట్‌ సరఫరాతో ప్రజల జీవన ప్రమాణాలు, వ్యాపారాలు మెరుగుపడ్డాయి. ప్రజల బాధలన్నీ తీరిపోయాయి.

పర్యాటక ఆకర్షణ.. చరిత్ర మురిసేలా మ‌న భవనాలు

పది సంవత్సరాల్లో హైదరాబాద్‌లో పలు ఐకానిక్‌ భవనాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోతగ్గది హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్‌ భవనం. ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ భవనం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకం మరో హైలైట్‌గా నిలిచింది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి ప్రజ్వరిల్లేలా దీన్ని రూపొందించారు. పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌లో భార‌త రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అందేద్క‌ర్‌ 125 అడుగుల ఎత్తైన విగ్రహం మ‌రింత విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక‌.. మరో ఐకానిక్‌ భవనం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా చెప్పుకోవ‌చ్చు.

రాష్ట్రం సాధించే దాకా.. 1,136 రోజుల రిలే దీక్షలు

రాష్ట్రసాధన ఉద్యమంలో భాగంగా అల్వాల్‌ ఐకాస ఆధ్వర్యంలో 1,136 రోజులపాటు కొనసాగిన రిలే దీక్షలు ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టాయి. ఉద్యమనేత కేసీఆర్‌ దీక్ష అనంతరం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ 2011 జనవరి 21న అప్పటికే ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ ప్రదర్శన అనంతరం ఈసేవ కూడలిలో దీక్షలు ప్రారంభించారు. రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న దీక్షలు విరమించారు. దయాకర్‌, సురేందర్‌రెడ్డి నాయకత్వంలో ఐకాస కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలు దీక్షల్లో కూర్చున్నారు. వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటి బీఆర్ఎస్‌ అప్పటి టీఆర్ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, ఐకాస నేత కోదండరాం, బీజేపీ నేత కిషన్‌రెడ్డి శిబిరాన్ని వేర్వేరుగా సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షలు కొనసాగిన వేదికను తెలంగాణ అమర వీరుల శిబిరంగా నామకరణంచేసి ప్రస్తుతం వివిధ రకాల ప్రదర్శనలకు కేంద్రంగా ఉపయోగిస్తున్నారు.

ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ

తెలంగాణ ఉద్యమ సమయంలో నగరంలోని ఎల్బీనగర్‌ కీలకంగా మారింది. తుది దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్‌ చౌరస్తాలోనే ఒంటికి నిప్పంటించుకున్నారు. హాస్పిటల్​కు తరలించగా జై తెలంగాణ అంటూ అసువులు బాశారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఎల్బీనగర్‌లో పెద్దఎత్తున ఉద్యమం కొనసాగింది. ఉద్యమ నేత కేసీఆర్‌ చేపట్టిన దీక్ష సమయంలో బీఎన్‌రెడ్డి నగర్‌లో మాధవరం నర్సింహ నేతృత్వంలో నిరహార దీక్ష చేపట్టారు. ఇలా ఈ గడ్డ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉంది. ఈ ప్రాంతానికి అప్పటి ఉద్యమకారులు వచ్చి సమావేశాలు, సభలు, ధర్నాల్లో పాల్గొన్నారు.

రవాణా మరింత ఈజీ.. టూరిస్టు ప్లేస్​గా కేబుల్​ బ్రిడ్జి

హైదరాబాద్‌ జాబితాలో మరో పేరున్న కట్టడం చేరింది. దుర్గం చెరువుపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంతో వాహనాల రాకపోకలకు ఈజీ అయ్యింది. ఈ బ్రిడ్జిని 202, సెప్టెంబర్​లో ప్రారంభించారు. అప్పటి ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. ఇక.. ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా, దూరాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ట్రాఫిక్ సమస్యలు కూడా చాలామట్టుకు తీరాయి. అంతేకాక, దుర్గం చెరువు ప్రాంతం పర్యటక పరంగానూ ఎంతో అభివృద్ధి చెందింది. మొత్తం ₹ 184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఇందుకు మొత్తం రెండేళ్ల సమయం పట్టింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ కంపెనీకి చేపట్టింది. కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టగా.. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

కేబుల్​ బ్రిడ్జి స్పెషాలిటీ ఇదే..

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45ను మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మన్ టెక్నాలజీతో ఎనిమిది దేశాల ఇంజినీర్లు 22 నెలలపాటు శ్రమించి దీన్ని నిర్మించారు. దుర్గం చెరువు నీటి మట్టానికి 20మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది. ఒక్కో పైలాన్‌కు 26 ద్రుఢమైన ఐరన్ కేబుళ్లను వాడారు.

సిటీకి అనుబంధం.. కొత్త జిల్లాగా మేడ్చల్‌

= రాజధాని అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కలగలిసి ఉండేవి. తెలంగాణ రాష్ట్రం అనంతరం రంగారెడ్డి జిల్లా ఉత్తర భాగాన్ని విడదీసి కొత్తగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాగా ఏర్పాటు చేశారు.

= హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సైబరాబాద్‌లో కొంతభాగం విడదీసి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు.

= శివారులో మున్సిపాలిటీలు, పంచాయతీలను కలిపి కొత్తగా మరో 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.

= రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట కార్పొరేషన్లు కాగా, మేడ్చల్‌ జిల్లాలో నిజాంపేట బోడుప్పల్, పిర్జాదీగూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి.

= రంగారెడ్డి జిల్లాలో 12 పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.

నేటికీ ఆ సమస్యలకు లభించని పరిష్కారం

ప్రత్యేక తెలంగాణ వస్తే దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా ఆశించారు. హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. వీటికి పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదు. రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారాలు చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement