హైదరాబాద్, ఆంధ్రప్రభ : వాణిజ్య పన్నుల పురోగతితో రాష్ట్ర ఖజానా నిండుతుండగా, మరోవైపు కోట్లాది రూపాయల పన్ను ఎగవేతలు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో పన్ను ఎగవేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రముఖ సంస్థలే ప్రత్యేకంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లుగా వెల్లడి కావడంతో దిద్దుబాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. ప్రత్యేకంగా పలువురు డిప్యుటీ కమిషనర్లతో వీటికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. 11 రంగాల్లో సేవా పన్ను వసూలు బాధ్యతలను ప్రత్యేకంగా కమిటీకి బాధ్యతలను అప్పగించారు. వ్యాట్, జీఎస్టీ, సీఎస్టీ, ఎంట్రీ పన్నుల వసూళ్లు, పెండింగ్‌లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాట్ సీఎస్టీ వంటివి అమలులో లేవు. అయితే జీఎస్టీ రాకకుపూర్వం కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇలా మిగిలిపోయి పెండింగ్‌లో ఉన్న రూ.3600కోట్లను రాబట్టుకోవడంతోపాటు, మొండి బకాయిలను సెటిల్ చేసుకోవాలని యోచిస్తోంది. గతేడాది అమ్మకం పన్నుల రాబడి రూ 26,803కోట్లురాగా, జీఎస్టీ రూ. 31641కోట్లు వసూలైంది. ప్రస్తుత ఏడాది అంచనాలను అమ్మకం పన్ను ఆదాయాన్ని రూ. 33వేలకోట్లకు, జీఎస్టీని రూ. 36,203కోట్లకు పెంచుకున్నారు.
కాగా వచ్చేనెల 1నుంచి జూన్ చివరివరకు వన్‌టైం సెటిల్‌మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చి బకాయిలను వసూలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జూలై 1నుంచి ఆగష్టు వరకు వివాదాలు పరిష్కరించుకునేందుకు సెల్ఫ్ డిక్లరేషన్‌తో వీలు కల్పించనున్నారు. వ్యాట్ బకాయిదారులు 11440మంది, సీఎస్టీ బాకయిపడిన 12680మంది వంటి వారికి జరిమానాలను మినహాయించడంతోపాటు అసలులోనూ రిబేటు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రికార్డులను ముందేసుకున్న డిసీలు అనేక వివరాలను ఆరా తీస్తున్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తూ నోటీసులను జారీ చేయనున్నారు. ఆయా సంస్థల్లో తనిఖీలతో అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. రాష్ట్రంలో ఈ 11 రంగాల్లో వివిధ సంస్థలు దాదాపు రూ. 1000 కోట్ల మేర పన్నులను ఎగవేశారని ప్రాథమికంగా గుర్తించారు. లావాదేవీలను, పన్ను చెల్లింపులను పరిశీలిస్తున్న అధికారులు కీలక చర్యలకు దిగేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. తాజాగా ఇలాంటి అక్రమాల్లో భాగంగా సేవాపన్ను చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డ కొందరికి ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది. ఏసీ బస్సులపై ఐదు శాతం సర్వీస్ టాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే అనేక సంస్థలు ఈ సేవా పన్నును చెల్లించడంలేదని సమాచారం. బ్యాంకులు, బీమా సంస్థలు, టెక్స్‌టైల్స్, విమానయాన, డిస్టిలరీలు వంటివి సేవా పన్నును సక్రమంగా చెల్లించడంలేదని గుర్తించారు. 2017 జూలై 1నుంచి 2018 మార్చి 31 వరకు ఆయా సంస్థల టర్నోవర్, పన్ను మదింపు వివరాలను డీసిలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఎగవేతలను గుర్తిస్తున్నారు.