ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షాల విమర్శలు, ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉంది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తోన్న లారీలు, ట్రాక్టర్లను వెనక్కి పంపుతున్నారు తెలంగాణ అధికారులు. ఈ మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని అందుకే వారిని వెనక్కి పంపుతున్నామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
కేటీ దొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బల్గెర, ఉండవల్లి మండలం పుల్లూరు వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన బృందం ధాన్యం రాకను పర్యవేక్షిస్తోంది. పుల్లూరు చెక్‌పోస్టు వద్దకు ఏపీ నుంచి ధాన్యం లోడుతో వచ్చిన లారీలను వెనక్కి పంపారు అధికారులు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, తెలంగాణలో కనీస మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.