తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. కరోనా ఉధృతి కారణంగా వరుసగా రెండో ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి గ్రేడ్లు కేటాయించింది. వీరిలో దాదాపు 2 లక్షల 10 వేల మందికిపైగా విద్యార్థులకు ఈ సారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మార్కుల అప్‌లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నది.
వాస్తవానికి గత వారమే గ్రేడింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ వరుస సెలవులతో కాస్త ఆలస్యమయింది. ప్రస్తుతం అంతా పూర్తయింది. విద్యాశాఖ నుంచి ఆమోదం వచ్చిన నేపథ్యంలో నేడోరెపో ఫలితాలను ప్రకటిస్తారు. గత ఏడాది నాలుగు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. కానీ ఈసారి ఒక్క ఎఫ్ఏ ఆధారంగానే వార్షిక పరీక్షల మార్కులు కేటాయించనున్నారు. కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు హాట్ టికెట్ నంబర్లు కేటాయించింది. ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ-1) మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షల మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కుల మెమోలో హాల్‌టికెట్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. గత సంవత్సరం నాలుగు ఎఫ్ఏ పరీక్షల సగటు ఆధారంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించగా, ఈసారి మాత్రం ఒక్క ఎఫ్ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.