తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సందర్భంగా ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. అక్కడినుంచి సికింద్రాబాద్ వెళ్లిన అమిత్ షా.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన కేంద్ర హోం మంత్రికి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదరక్షలు అందించారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. అమిత్షా కోసం చెప్పులు తేవడానికి బండి సంజయ్ వెళ్లారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నదని తెలిపారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని బండి సంజయ్ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. సాగుచట్టాలతో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఎవరు క్షమాపణలు చెప్పారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీకొట్టి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.