Monday, November 11, 2024

ప్రైవేటు దోపిడీకి కళ్ళెం.. 6 ఆస్పత్రుల లైసెన్స్ రద్దు

నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. ఆరు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల లైసెన్స్‌ను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది. సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది. అలాగే బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్‌ ఆసుపత్రి, ఎల్బీనగర్‌లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆస్పత్రులపై కొవిడ్‌ ట్రీట్‌మెంట్ రద్దు చేసింది. ఇప్పటివరకు 113 ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అధిక బిల్లులు వ‌సూలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పటికే మార్గ‌దర్శ‌కాలు జారీ చేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాల‌ని స్పష్టం చేసింది. ఫీజుల వివ‌రాల‌ను ఆస్ప‌త్రిలో కీల‌క ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించింది. అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సూచించింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాలి. కోవిడ్ చికిత్స‌కు వినియోగించే మందుల‌కు ఎంఆర్‌పీ ధ‌ర‌ల‌ను, పీపీఈ కిట్‌లు, ఖ‌రీదైన మందుల ధ‌ర‌ల‌ను సైతం ఆస్ప‌త్రిలో ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించింది. రోగుల‌ను డిశ్చార్జి చేసే స‌మ‌యంలో స‌మ‌గ్ర వివ‌రాల‌తో బిల్లు ఇవ్వాల‌ని వెల్ల‌డించింది ప్ర‌భుత్వం. నిబంధ‌న‌లు పాటించ‌ని ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ పేర్కొంది. అయినా పలు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement