Saturday, November 23, 2024

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు.. 13 మంది క్వారంటైన్

భారత్ లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా తెలంగాణలో తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయింది. ఇటీవలే దుబాయ్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు.

ఈ నెల 16న బాధితుడు దుబాయ్ నుంచి వచ్చాడు. దుబాయ్, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల్లో ఆయన పరీక్షలు నిర్వహించగా.. రెండు చోట్లా నెగెటివ్ రిపోర్ట్ వచ్చాయి. అయితే, జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల కోసం పంపిన నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులతో కలిపి మొత్తం 13 మంది క్వారంటైన్ చేశారు. గూడెంలో వీధుల్లో శానిటైజేషన్ చేశారు.

కాగా, ఇప్పటికే తెలంగాణలో 20కి పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.



Advertisement

తాజా వార్తలు

Advertisement