కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను తాత్కాలికంగా మూసివేయడంతో ప్రైవేటు టీచర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. స్కూల్స్ మూత పడి జీవనానికి కూడా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లుకు ప్రభుత్వం రూ.2000, బియ్యం 25 కిలోల బియ్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా వీటిని ఎలా పొందాలి అనే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం మార్చి 16, 2020 నాటికి గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఈ సాయం పొందేందుకు అర్హులు. ప్రభుత్వ లబ్ధి పొందాలనుకొనే గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేవారు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్ప్లై చేసుకోవల్సి ఉంటుంది. ఈ పత్రాలను ప్రింట్ తీసుకొని సంబంధిత ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అందించాలి, పాఠశాలల యాజమాన్యం డీఈవోకు టీచర్ల వివరాలు అందించాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులు దరఖాస్తు దారులను ధృవీకరించి కలెక్టర్‌కు వివరాలను అందజేస్తారు. కలెక్టర్ తెలంగాణలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ప్రైవేటు టీచర్ల వివరాలను సమర్పిస్తారు. వారికి విద్యాసంస్థలు తిరిగి మొదలు అయ్యే వరకు ప్రతి నెల 25 కిలోల బియ్యాన్ని రూ.2000లను అందించనున్నారు.
కాగా, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లబ్ధి కలగనుంది.