ఉద్యోగుల వేతనసవరణకు త్వరలో క్లియరెన్స్ రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆర్థికశాఖ సోమవారం పీఆర్సీ జీవోలు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలిసిందే. భారీ కసరత్తు తరువాత వేతనసవరణ ప్రతిపాదనలకు సంబంధించి ఆర్థికశాఖ డ్రాఫ్ట్ జీవోలను రూపొందించింది. ఆ జీవోల ప్రతులను సంతకం కోసం ఈనెల 10 వ తేదీన సీఎం కేసీఆర్ కు పంపినట్లు ఆర్థికశాఖ వర్గాల భోగట్టా. ఈ పీఆర్సీతో మొత్తంగా 9 లక్షల 17 వేలా 797 మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు. పీఆర్సీ జీవోలు జారీ అయిన తరువాత ఆర్థికశాఖ, నిపుణులతో కూడిన అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయనుంది. పీఆర్సీ ఉత్తర్వులు వచ్చిన తరువాత తలెత్తే సందేహాల నివృత్తిపై ఈ కమిటీ దృష్టిసారించనుంది.
వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ అటు సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. కానీ ఎట్టకేలకు ఈ శనివారం రాత్రి క్లియర్ అయింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు, ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకుని వేతనాల పెంపును చేయాలంటూ నిర్ణయం తీసుకుని, ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగవర్గాలందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నారు. దీంతో వచ్చేనెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగవర్గాలు వేతనాలు అందుకోనున్నారు.